కంటోన్మెంట్ ఉప ఎన్నికల వేళ ఊహించని ట్విస్ట్
శ్రీగణేష్ కి బీజేపీ అధికారికంగా టికెట్ ఖాయం చేయడమే మిగిలుంది అనుకుంటున్న టైమ్ లో కాంగ్రెస్ ఆయన్ను పట్టుకుపోయింది. ఈ చేరికతో కంటోన్మెంట్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టిపోటీ ఉండే అవకాశాలు కనపడుతున్నాయి.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నేతల్ని వంతుల వారీగా తమ వైపు తిప్పుకున్నాయి కాంగ్రెస్, బీజేపీ. ఇప్పుడు అసలు యుద్ధం మొదలైంది. బీజేపీ-కాంగ్రెస్ మధ్య గోడ దూకుళ్లు స్టార్ట్ అయ్యాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల వేళ బీజేపీ కీలక నేత శ్రీ గణేష్, కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కంటోన్మెంట్ స్థానానికి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశాలున్నాయి. ఆ హామీతోనే ఆయన పార్టీ మారినట్టు చెబుతున్నారు. మూడు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ రెండో స్థానంలో నిలవడం విశేషం. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా మారిపోయారు.
ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నేత లాస్య నందిత గెలిచారు. ఆ తర్వాత ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ తరపున సాయన్న మరో కుమార్తె, లాస్య నందిత సోదరి నివేదిత ఎన్నికల్లో పోటీ చేస్తానని అంటున్నారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి శ్రీగణేష్ ఈసారి గట్టిపోటీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గద్దర్ కుమార్తె వెన్నెలకు గత ఎన్నికల్లో మూడో స్థానం దక్కింది. ఈసారి కూడా కాంగ్రెస్ టికెట్ వెన్నెలకే ఇస్తారనే అంచనాలున్నాయి. అయితే సడన్ గా సీన్ మారిపోయింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ని ఓడించాలని ప్రణాళికలు సిద్ధం చేసిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థికి గేలం వేసింది. ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న శ్రీగణేష్ కూడా వెంటనే కండువా మార్చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు.
బీజేపీకి షాక్..
మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ తో కలసి శ్రీ గణేష్ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎంపీ ఎన్నికలతోపాటే కంటోన్మెంట్ ఉప ఎన్నికకు కూడా షెడ్యూల్ విడుదల కావడంతో అక్కడ ప్రచారం ముమ్మరం చేశారు. శ్రీగణేష్ కి బీజేపీ అధికారికంగా టికెట్ ఖాయం చేయడమే మిగిలుంది అనుకుంటున్న టైమ్ లో కాంగ్రెస్ ఆయన్ను పట్టుకుపోయింది. ఈ చేరికతో కంటోన్మెంట్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టిపోటీ ఉండే అవకాశాలు కనపడుతున్నాయి.