Telugu Global
Telangana

రజ్వీ వారసుడు అసదుద్దీన్.. బీజేపీ డైరెక్ట్ అటాక్..

నరరూప రాక్షసుడు ఖాసిం రజ్వీ వారసుడు అసదుద్దీన్ ఒవైసీ అని విమర్శించారు మురళీధరరావు. పాకిస్తాన్ జెండాలు తెలంగాణలో అక్కడక్కడ ఉన్నాయని, బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ జెండాలు ఉండవన్నారు.

రజ్వీ వారసుడు అసదుద్దీన్.. బీజేపీ డైరెక్ట్ అటాక్..
X

సెప్టెంబర్-17 విమోచన దినోత్సవానికి సిద్ధమవుతున్న బీజేపీ త‌న అసలు వ్యూహం ఏంటో ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో మత కల్లోలాలు రెచ్చగొట్టేందుకే బీజేపీ సెప్టెంబర్-17ని వాడుకోబోతోందని అర్థమవుతోంది. ఇప్పటికే రాజాసింగ్ ద్వారా వేసిన పాచిక పారలేదు, గణేష్ నిమజ్జనం సందర్భంగా అస్సోం సీఎం ని తీసుకొచ్చి హడావిడి చేసినా ఫెయిలయ్యారు. దీంతో ఇప్పుడు తమ ఫోకస్ అంతా సెప్టెంబర్ -17 పై పెట్టారు బీజేపీ నేతలు. వారం ముందుగానే రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కలకలం సృష్టిస్తున్నారు.

సెప్టెంబర్-17తో అసలు బీజేపీకి సంబంధం ఏంటని సీపీఐ నేతలు ప్రశ్నించడాన్ని తప్పుబట్టారు బీజేపీ సీనియర్ నేత మురళీధరరావు. కమ్యూనిస్టులు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారని, భారత దేశం కోసం కాదని అన్నారాయన. కమ్యూనిస్ట్ రాజ్యం ఏర్పాటు కోసం పోరాడారని, దేశ భక్తితో మాత్రం కాదన్నారు. 1948 నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీలకు దేశభక్తి లేదని చెప్పారు. 2014నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో సెప్టెంబర్ 17ని ఎందుకు జరపలేదని, కేంద్రం విమోచనం దినం అన్న తర్వాతే రాష్ట్రం విలీన దినం అనడం సరికాదన్నారు. ఆ క్రెడిట్ బీజేపీకి వస్తుందనే తెలంగాణ ప్రభుత్వం జాతీయ ఐక్యత దినం అంటూ ప్రకటించిందని, ఆ ప్రకటనకు కూడా అసదుద్దీన్ ఒవైసీ పర్మిషన్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు.

నరరూప రాక్షసుడు ఖాసిం రజ్వీ వారసుడు అసదుద్దీన్ ఒవైసీ అని విమర్శించారు మురళీధరరావు. పాకిస్తాన్ జెండాలు తెలంగాణలో అక్కడక్కడ ఉన్నాయని, బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ జెండాలు ఉండవన్నారు. అసదుద్దీన్ చేత భారత్ మాతా కి జై, జై భారత్ మాతా అనిపించి తీరతామన్నారు మురళీధర రావు.

బీజేపీ టార్గెట్ ఏంటి..?

విమోచన దినం అయినా, విలీన దినం అయినా.. ఆనాటి త్యాగాలను గుర్తు చేసుకోవడమే పరమావధి. అయితే బీజేపీ దీన్ని ఓ దండయాత్రలా మార్చేసింది. పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహిస్తామంటోంది. మూడు రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించామంటోంది. కర్నాటకలో బీజేపీ, మహారాష్ట్రలో బీజేపీ చెప్పుచేతల్లోని షిండే ప్రభుత్వం ఉన్నాయి. అమిత్ షా సహా కీలక నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఓవైపు ఇది హిందు, ముస్లిం లకు చెందిన కార్యక్రమం కాదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చెబుతున్నా, మరోవైపు రజ్వీ వారసుడు అసదుద్దీన్ అంటూ అదే బీజేపీ నేతలు కామెంట్ చేయడం విశేషం. కేవలం ముస్లింలను రెచ్చగొట్టడానికే బీజేపీ ఈ కార్యక్రమం చేపడుతోందనే అనుమానాలున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక వేళ, మరోసారి మతకల్లోలం సృష్టించడానికి బీజేపీ వేసిన ఎత్తుగడే ఇది అంటున్నారు. ముందు ముందు ఇంకెన్ని సంచలన‌ వ్యాఖ్యలు వినాల్సి వస్తుందో వేచి చూడాలి.

First Published:  11 Sept 2022 8:37 AM IST
Next Story