Telugu Global
Telangana

సొంత పార్టీ నేతలను దున్నపోతుతో పోల్చిన జితేందర్‌ రెడ్డి

తెలంగాణ బీజేపీ నేతలకు కూడా ఇలాంటి ట్రీట్‌మెంట్ అవసరమంటూ వీడియోపై కామెంట్‌ చేశారు. ఈ ట్వీట్‌ను బీఎల్ సంతోష్‌, బీజేపీ ఇండియా, అమిత్ షా, సునీల్‌ బన్సల్‌కు ట్యాగ్‌ చేశారు.

సొంత పార్టీ నేతలను దున్నపోతుతో పోల్చిన జితేందర్‌ రెడ్డి
X

కలహాల కాపురానికి టీ కాంగ్రెస్‌ పెట్టింది పేరు. ఇప్పుడీ విషయంలో తెలంగాణ బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. కాషాయ పార్టీలో అసంతృప్తులు బాహటంగానే బయటపడుతున్నాయి. అసంతృప్త నేతలకు అధిష్టానం కౌన్సెలింగ్‌ ఇచ్చినా లుకలుకలు మాత్రం బయటపడుతూనే ఉన్నాయి. పార్టీలో బండి సంజయ్‌, ఈటల వర్గాల మధ్య విభేదాలున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి కొత్త చర్చకు తెరతీశారు. సొంత పార్టీ నేతలను దున్నపోతుతో పోల్చారు.

జితేందర్‌ రెడ్డి తాజాగా చేసిన ట్వీట్‌ ఇప్పుడు తెలంగాణ బీజేపీలో దుమారం రేపుతోంది. ఓ వ్యక్తి దున్నపోతును తన్నుతూ ట్రాలీలోకి ఎక్కిస్తున్న వీడియోను జితేందర్‌ రెడ్డి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. తెలంగాణ బీజేపీ నేతలకు కూడా ఇలాంటి ట్రీట్‌మెంట్ అవసరమంటూ వీడియోపై కామెంట్‌ చేశారు. ఈ ట్వీట్‌ను బీఎల్ సంతోష్‌, బీజేపీ ఇండియా, అమిత్ షా, సునీల్‌ బన్సల్‌కు ట్యాగ్‌ చేశారు.


జితేందర్‌ రెడ్డి ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్‌ చేశారనే చర్చ ఇప్పుడు తెలంగాణ బీజేపీలో మొదలైంది. కొంతకాలంలో చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌, మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి పార్టీ వీడుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో పార్టీ అధిష్టానం ఈ ఇద్దరు నేతలను హస్తినకు పిలిపించుకొని మంతనాలు జరిపింది. ఢిల్లీ టూర్‌ నుంచి వచ్చిన ఈటల తాను పార్టీ మారడంలేదని, కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

బండి, ఈటల వివాదం నేపథ్యంలో ఇటీవల ఎంపీ జితేందర్ రెడ్డి నివాసంలో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, విజయశాంతి తదితరులు బండి సంజయ్‌కి అనుకూలంగా సమావేశం నిర్వహించారనే వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పుడు జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్‌ కూడా అసంతృప్త నేతలను ఉద్దేశించిందే అని చర్చించుకుంటున్నారు పార్టీ క్యాడర్‌.

మొత్తానికి కేసీఆర్‌ను గద్దె దింపడమే లక్ష్యమని ప్రకటించుకుంటున్న తెలంగాణ బీజేపీలో విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. మరి ఈ అనైక్యతకు అధిష్టానం ఎలా చెక్‌ పెడుతుందో చూడాలి.

First Published:  29 Jun 2023 11:58 AM IST
Next Story