ముస్లిం యువకుడితో కూతురు పెళ్లి రద్దు చేసిన బీజేపీ నాయకుడు.. కారణం ఏంటో తెలుసా?
బీజేపీ నాయకుడు ముస్లిం యువకుడితో తన కూతురు పెళ్లి చేస్తున్నట్లు ఉన్న ఆ వివాహ శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో మత పెద్దలు, రైట్ వింగ్ యాక్టివిస్ట్ గ్రూప్‌లు భగ్గుమన్నాయి.
ఏ పెళ్లి అయినా అది కుటుంబ వ్యవహారం. పెద్దలకు నచ్చిన వరుడు/వధువును వెతికి తమ పిల్లల పెళ్లి చేస్తారు. తమ బిడ్డ భవిష్యత్ మంచిగా ఉండాలని ప్రతీ తల్లిదండ్రలు కోరుకుంటారు. ఉత్తరాఖండ్‌లోని ఒక బీజేపీ నాయకుడు కూడా అదే ఆలోచించాడు. తన కూతురు ప్రేమించిన ఒక యువకుడితో పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నాడు. కానీ మత పెద్దలు, బీజేపీ నాయకులు, రైట్ వింగ్ గ్రూప్ నుంచి వచ్చిన బెదిరింపులు.. స్థానికంగా చెలరేగిన ఆందోళనల కారణంగా పెళ్లిని రద్దు చేయాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరాఖండ్‌లోని పౌరి గర్హ్వాల్ మున్సిపల్ చైర్ పర్సన్, బీజేపీ నాయకుడు యశ్ పాల్ రావత్ అలియాస్ యశ్‌పాల్ బెనమ్ తన కూతురు పెళ్లిని ఈ నెల 28న జరపాలని నిశ్చయించాడు. తన కూతురు రూర్కీలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్న సమయంలో క్లాస్‌మేట్‌ను ప్రేమించింది.ఈ విషయం ఇంటిలో చెప్పి ఒప్పించింది. దీంతో బీజేపీ నాయకుడు యశ్‌పాల్ రావత్ పెళ్లి చేయడానికి అంగీకరించాడు. ఈ మేరకు పెళ్లి కార్డులు ప్రింట్ చేసి బంధువుల, స్నేహితులు, సన్నిహితులకు పంచిపెట్టాడు. బీజేపీ నాయకుడు ముస్లిం యువకుడితో తన కూతురు పెళ్లి చేస్తున్నట్లు ఉన్న ఆ వివాహ శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో మత పెద్దలు, రైట్ వింగ్ యాక్టివిస్ట్ గ్రూప్‌లు భగ్గుమన్నాయి.
రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లో స్వామీ దర్శన్ భారతి అనే మత పెద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఏకంగా ఈ పెళ్లి పైనే చర్చ జరిగింది. రావత్ కుటుంబాన్ని వెంటనే బహిష్కరించాలని.. అతడు తన కూతురు పెళ్లి ముస్లిం యువకుడితో జరుపుతున్నాడని.. అంటే లవ్ జీహాద్‌కు మద్దతు తెలుపుతున్నాడంటూ సభలో ప్రసంగించారు. లవ్ జీహాద్, ల్యాండ్ జీహాద్‌లను వ్యతిరేకించాల్సిన బీజేపీ నాయకుడు ఇలా స్వయంగా వారితో సంబంధాలు పెట్టుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉత్తరాఖండ్ అంటే దేవతల భూమి.. అలాంటి భూమిపై పుట్టిన మన కూతుర్లను ముస్లింలతో పెళ్లిళ్లు జరిపిస్తుంటే చూస్తూ ఊరుకుంటామా అంటూ రెచ్చగొట్టేలా ప్రసంగం చేశారు. రావత్‌కు తప్పకుండా గుణపాఠం చెప్పాలని ఆయన సభకు వచ్చిన వారికి పిలుపునిచ్చారు. ఆ తర్వాత ప్రసంగించిన వాళ్లు కూడా విద్వేష ప్రసంగాలు చేశారు.
ఇక హర్యానాకు చెందిన ఒక రైట్ వింగ్ గ్రూప్ చార్‌ధామ్ యాత్రకు వెళ్తూ ఈ పెళ్లి విషయాన్ని తెలుసుకున్నది. యాత్రను పౌరీలో ఆపేసి.. అక్కడి మున్సిపల్ కార్యాలయాని వెళ్లింది. చైర్మన్ యశ్‌పాల్ రావత్ ఛాంబర్‌లోకి దూసుకొని పోయి నిరసన తెలియజేసింది. అయితే వాళ్లు లోపలకు రావడానికి ముందే వెనక నుంచి వెళ్లిపోయిన రావత్.. వారి దాడి నుంచి తప్పించుకున్నారు. ఇక పౌరీ జిల్లా మెజిస్ట్రేట్‌కుఈ పెళ్లి గురించి కొంత మంది వినతిపత్రం ఇచ్చారు. ప్రశాంతంగా ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ పెళ్లి వలన అల్లర్లు చెలరేగుతున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ఒక వేళ యశ్‌పాల్ రావత్ ఈ పెళ్లి చేయాలనుకుంటే రాష్ట్రం వదిలి వెళ్లి.. వేరే దగ్గర పెళ్లి చేసేలా చూడాలని కోరారు.
రాష్ట్రంలో తన కూతురు పెళ్లిపై వ్యతిరేకత రావడం.. తనకు బెదిరింపు కాల్స్ వస్తుండటంతో పెళ్లి రద్దు చేస్తున్నట్లు రావత్ ప్రకటించారు. పెళ్లి కొడుకు కుటుంబంతో తాను మాట్లాడతానని.. తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని రావత్ అన్నారు. ప్రస్తుతానికి అయితే పెళ్లిని రద్దు చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు.