కేసీఆర్ పై పోటీ చేస్తా.. ఈటల రాజేందర్ సంచలన ప్రకటన
ఇప్పుడు కేసీఆర్ పై పోటీ చేస్తున్నట్లు స్వయంగా ఈటల ప్రకటించారు. ఈటల చేసిన ప్రకటన తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ప్రకటన చేశారు. తన సొంత నియోజకవర్గంతో పాటు సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గంలోనూ పోటీ చేస్తానంటూ ప్రకటించారు. తెలంగాణలో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి రాజకీయ వేడి మరింత పెరిగింది. తాజాగా ఈటల చేసిన ప్రకటన మరింత హీట్ పెంచింది.
ఈటల రాజేందర్ ఒకప్పుడు బీఆర్ఎస్ లో ఒక వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. చాలా ఏళ్లపాటు ఆ పార్టీలో ఈటల కీలక నేతగా ఉన్నారు. అయితే కేసీఆర్, ఈటల మధ్య విభేదాలు ఏర్పడి వారిద్దరి మధ్య దూరం పెరిగింది. తర్వాత ఏర్పడిన రాజకీయ పరిస్థితుల కారణంగా ఈటల బీఆర్ఎస్ కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ తర్వాత హుజూరాబాద్‌లో వచ్చిన ఉప ఎన్నికల్లో ఈటల గెలుపొందారు.
ఇదిలా ఉంటే గురువారం హుజూరాబాద్ లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగగా.. ఈ కార్యక్రమంలో ఈటల పాల్గొని మాట్లాడారు. తాను తన నియోజకవర్గంతో పాటు సీఎం కేసీఆర్ పై గజ్వేల్‌లో రెండు చోట్ల పోటీ చేస్తానని ప్రకటించారు. కేసీఆర్ పై ఈటల సతీమణి జమున పోటీ చేస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రచారంలో నిజం లేదని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు.
అయితే ఇప్పుడు కేసీఆర్ పై పోటీ చేస్తున్నట్లు స్వయంగా ఈటల ప్రకటించారు. ఈటల చేసిన ప్రకటన తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ పై పోటీ చేస్తానని ఈటల ప్రకటించినప్పటికీ.. అందుకు బీజేపీ అధిష్టానం అనుమతి ఇస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది.