Telugu Global
Telangana

బీజేపీలో కూడా 'రెడ్' డైరీ..! పోలీసులకు డీకే అరుణ వార్నింగ్

డీకే అరుణ వ్యాఖ్యలు వింటే గతంలో రేవంత్ రెడ్డి ఎపిసోడ్ గుర్తురాక మానదు. ఇప్పుడు పోలీసుల మనోభావాలు దెబ్బతీసే వంతు బీజేపీకి వచ్చింది. విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉంటే తమపై ఎందుకీ నిందలు అంటూ పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీలో కూడా రెడ్ డైరీ..! పోలీసులకు డీకే అరుణ వార్నింగ్
X

‘వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీయే. అతి చేసిన పోలీసుల రుణం ఏ మాత్రం ఉంచుకోకుండా వారి సంగతి చూద్దాం.. వారి లెక్కలు సరిచేద్దాం..’ తెలంగాణ పోలీసులను ఉద్దేశించి మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ చేసిన వ్యాఖ్యలివి. పోలీసుల సంగతి తేలుద్దామంటున్న ఆమె తమపై కక్ష సాధింపులకు పాల్పడుతున్న పోలీసు అధికారుల పేర్లను బీజేపీ కార్యకర్తలు రాసిపెట్టుకోవాలని సూచించారు. దీంతో ఆమె వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. చలో గజ్వేల్ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులపై డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు.

పోలీసులపై ఎందుకీ కోపం..?

డీకే అరుణ వ్యాఖ్యలు వింటే గతంలో రేవంత్ రెడ్డి ఎపిసోడ్ గుర్తురాక మానదు. తమని ఇబ్బంది పెడుతున్న పోలీసుల పేర్లన్నీ రెడ్ డైరీలో రాసుకుంటున్నానని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వారి సంగతి తేలుస్తానన్నారు రేవంత్ రెడ్డి. ఇటీవలే ఆయన వ్యాఖ్యలు సంచలనం కాగా వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. చివరకు ఆయన సెక్యూరిటీ కూడా స్వచ్ఛందంగా విధులకు దూరంగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు పోలీసుల మనోభావాలు దెబ్బతీసే వంతు బీజేపీకి వచ్చింది. విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉంటే తమపై ఎందుకీ నిందలు అంటూ పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయాలతో తమకు సంబంధం లేదని, ఏ పార్టీ అయినా తమకు ఒకటేనని అంటున్నారు తెలంగాణ పోలీసులు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఆందోళనలు, నిరసనల పేరుతో హడావిడి చేసి, సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో గందరగోళం సృష్టించి హైలైట్ కావాలనేది బీజేపీ నేతల ఆలోచన. అయితే చలో గజ్వేల్ విఫలం కావడంతో వారికి కావాల్సినంత ప్రచారం లభించలేదు. దీంతో డీకే అరుణ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో వ్యక్తిగా మారారు. పోలీసుల లిస్ట్ రాసిపెట్టుకుంటున్నాం, అధికారంలోకి వచ్చాక వారి సంగతి తేలుస్తామన్నారు. ఆమె వ్యాఖ్యలను పలువురు పోలీసులు ఖండించారు.


First Published:  2 Sept 2023 8:31 AM IST
Next Story