గద్వాల్‌లో పోటీ చేయడం లేదు.. డీకే అరుణ ప్రకటన
ఒకవైపు సీనియర్ నేతలు వరుసగా పార్టీ వదిలి కాంగ్రెస్ లో చేరుతుంటే, మరోవైపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సరైన అభ్యర్థులు లేక జనసేనతో పొత్తు పెట్టుకునే స్థాయికి బీజేపీ దిగజారింది.
తెలంగాణలో బీజేపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే సీనియర్ నేతలైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ లో చేరారు. ఇక బీజేపీలో మరో కీలక నాయకురాలైన డీకే అరుణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఈ విషయం గురించి గత వారమే తన నిర్ణయాన్ని ప్రకటించిన డీకే అరుణ.. ఇవాళ మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన, ప్రచారంలో వెనుకబడ్డ బీజేపీకి డీకే అరుణ నిర్ణయం కూడా షాకిచ్చింది.
తెలంగాణలో కొన్ని నెలల కిందటి వరకు కూడా బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనన్నట్లు పరిస్థితి ఉండేది. ఆ తర్వాత రేసులోకి కాంగ్రెస్ రాగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ లతో పోలిస్తే బీజేపీ బాగా వెనకబడిపోయింది.
ఒకవైపు సీనియర్ నేతలు వరుసగా పార్టీ వదిలి కాంగ్రెస్ లో చేరుతుంటే, మరోవైపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సరైన అభ్యర్థులు లేక జనసేనతో పొత్తు పెట్టుకునే స్థాయికి బీజేపీ దిగజారింది. పరిస్థితి ఇలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని తాజాగా బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ వెల్లడించారు. ఈ మేరకు అధిష్టానానికి తన నిర్ణయం కూడా తెలియజేశారు. సరైన అభ్యర్థులు దొరక్క బీజేపీ ఇబ్బంది పడుతున్న సమయంలో డీకే అరుణ తీసుకున్న నిర్ణయం బీజేపీకి షాకిచ్చింది.
కాగా, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు డీకే అరుణ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా అంటే డీకే అరుణ స్థానంలో బీసీ అభ్యర్థిని బరిలోకి దించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.