Telugu Global
Telangana

కోమటిరెడ్డే షిండే.. టచ్‌లో ఐదుగురు మంత్రులు

కాంగ్రెస్ పార్టీ వసూళ్లకు హైదరాబాద్‌ అడ్డాగా మారిందన్నారు మహేశ్వర్‌రెడ్డి. హైదరాబాద్‌ డబ్బులు దేశ రాజకీయాల కోసం కాంగ్రెస్‌ వినియోగిస్తోందని ఆరోపించారు.

కోమటిరెడ్డే షిండే.. టచ్‌లో ఐదుగురు మంత్రులు
X

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ గేట్లు తెరిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం 48 గంటలు కూడా ఉండదని హెచ్చరించారు. 8 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారన్న.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలకు ఆయన గట్టి కౌంటర్‌ ఇచ్చారు. బీజేపీ ఎమ్మెల్యేలను టచ్‌ చేస్తే కాంగ్రెస్‌ సర్కారు కూలడం ఖాయమన్నారు.

కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డే.. షిండే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి. బీజేపీ హై కమాండ్‌తో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టచ్‌లో ఉన్నారని ఆరోపించారు. అమిత్ షా, గడ్కరీనీ కలిసి షిండే పాత్ర పోషించేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పింది నిజం కాదా అని కోమటిరెడ్డిని ప్రశ్నించారు. కోమటిరెడ్డి షిండే పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నా.. తమకే ఆయనపై నమ్మకం లేక ఆయన్ని రానివ్వడం లేదన్నారు. కోమటిరెడ్డితో కలిపి ఐదుగురు మంత్రులు తమకు టచ్‌లో ఉన్నారన్నారు మహేశ్వర్‌రెడ్డి.

కాంగ్రెస్ పార్టీ వసూళ్లకు హైదరాబాద్‌ అడ్డాగా మారిందన్నారు మహేశ్వర్‌రెడ్డి. హైదరాబాద్‌ డబ్బులు దేశ రాజకీయాల కోసం కాంగ్రెస్‌ వినియోగిస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్‌ రెడ్డి చేస్తున్న వసూళ్ల చిట్టా తమవద్ద ఉందన్నారు. 3వేల కోట్లు వసూల్ చేసి.. 1500 కోట్ల రూపాయల్ని ఇప్పటికే రాహుల్‌ గాంధీకి రేవంత్ కప్పం కట్టారన్నారు మహేశ్వర్‌రెడ్డి. ఇంకో 500 కోట్లు పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు పోతే అడ్రస్ గల్లంతయ్యే కాంగ్రెస్‌కు.. పక్కపార్టీలను గెలుక్కోవడం అవసరమా అన్నారు. ఇప్పటికైనా ప్రగల్భాలు మానుకుని హామీల అమలుపై కాంగ్రెస్‌ నేతలు దృష్టిపెట్టాలని హితవు పలికారు మహేశ్వర్‌రెడ్డి.

First Published:  30 March 2024 5:33 PM IST
Next Story