Telugu Global
Telangana

కోమటిరెడ్డి మెడకు బిగుసుకున్న 'అభివృద్ధి'! మునుగోడులో జగదీశ్ తంత్రానికి బీజేపీ బెంబేలు!!

టిఆర్ఎస్‌లో అసమ్మతి ఛాయలు కనిపించిన వెంటనే వాటిని మంత్రి జగదీశ్ రెడ్డి మొగ్గలోనే తుంచివేశారు. తనకు ఎలాంటి సమాచారం అందడం లేదంటూ మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ చేసిన‌ వ్యాఖ్య‌ల్లో తప్పేమీ లేదని, సమాచార లోపం వల్ల ఇలా జరిగింది. అందరం కలిసే పనిచేస్తున్నామ‌ని జగదీశ్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి పరిస్థితిని తక్షణం అదుపులోకి తీసుకొచ్చారు.

కోమటిరెడ్డి మెడకు బిగుసుకున్న అభివృద్ధి!  మునుగోడులో జగదీశ్ తంత్రానికి బీజేపీ బెంబేలు!!
X

''నా త్యాగంతోనే మునుగోడు అభివృద్ధి జరగనుంది. ప్రజల అభిప్రాయం, అంగీకారంతోనే రాజీనామా చేశా. ఉపఎన్నిక చారిత్రక తీర్పుతో కేసీఆర్‌ పతనం ప్రారంభమవుతుంది. నేను రాజీనామా చేయడం వల్లనే ఆయన ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత డబ్బు ఖర్చుపెట్టి పేదలకు సాయం చేస్తున్నా. రాజకీయాల్లోకి రాకముందే నేను వ్యాపారవేత్తను. రాజకీయాలను అడ్డం పెట్టుకుని కాంట్రాక్టుల కోసం, డబ్బుల కోసం అమ్ముడుపోలేదు. అభివృద్ధి జరగాలంటే రాజీనామా చేయవలసిందేనని ప్రజలు భావించారు. మెజార్టీ అభిప్రాయం తీసుకుని రాజీనామా చేశా. రాజీనామాతో ప్రభుత్వం దిగొచ్చింది. రాబోయే రోజుల్లో మునుగోడు అభివృద్ధి ఎలా జరుగుతుందో చూస్తారు. పింఛన్లు, రేషన్ కార్డులు వస్తాయి, రోడ్లు వేస్తారు. ఇంకా ఎంతో అభివృద్ధి జరుగుతుంది'' అని సరిగ్గా నెల కిందట ఆగస్టు 13న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అన్నారు.

అయితే చెప్పినదానికి విరుద్ధమైన సన్నివేశాలు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్నాయి. బీజేపీ అభ్యర్థిగా ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజగోపాలరెడ్డిని ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఈ ఘటనలు ఆయన ఊహించినవి కావు. ఒక వైపు తమ పార్టీ జెండాపై ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ ఫిరాయించారన్న ఆగ్రహం కాంగ్రెస్ కార్యకర్తల్లో కనిపిస్తోంది. మరోవైపు 2018 ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీల గురించి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆయనపై నిప్పులు కురిపిస్తున్నారు. ''నా సొంత డబ్బుతో సీసీ రోడ్లు వేయిస్తా. వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తా'' అని సంస్థాన్ నారాయణపూర్ మండలం మర్రిగూడెం గ్రామ ప్రజలకు కోమటిరెడ్డి గత ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చారు. ఇవే హామీల గురించి సెప్టెంబర్ 10న ఆ గ్రామస్థులు మాజీ ఎమ్మెల్యేను నిలదీశారు. 'మూడేండ్ల నుంచి కనిపించకుండా ఇప్పుడెందుకు వచ్చావు' అని ప్రజలు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి నిరసన తెలిపారు. ఈ హఠాత్పరిణామానికి మాజీ ఎమ్మెల్యే ఖంగుతిన్నారు. 'మరోసారి మా ఊరికొస్తే మర్యాద దక్కదు' అని మహిళలు హెచ్చరించారు. ఇంతకుముందు నాంపల్లి మండలంలోనూ ఇలాంటి చేదు అనుభవాన్ని కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి చవిచూశారు.

కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తనకు తాను ఎక్కువగా ఊహించుకోవడం, అతిగా అంచనా వేసుకోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నట్టు సులభంగా విశ్లేషించవచ్చు. మెజారిటీ ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు రాజగోపాలరెడ్డి చేస్తున్న ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది. బీజేపీ ఆశీస్సులతో వేల కోట్ల విలువ చేసే కాంట్రాక్టులు దక్కించుకున్నందుకు ప్రతిఫలంగానే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మునుగోడు ఉపఎన్నికకు కారణమైనట్టు ప్రజల్లో ఒక అభిప్రాయం బలంగా నాటుకుపోయింది . వాళ్ళు అనుకుంటున్నదీ, లేదా ప్రచారంలో ఉన్న అంశాల్లో నిజానిజాల గురించి పరిశోధన అనవసరం. తాను వ్యాపారవేత్తనని ఆయన బహిరంగంగానే చెప్పుకుంటున్నందున ఇక ఆ వివాదంలోకి పోనవవసరం లేదు.

అయితే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఏ 'అభివృద్ధి మంత్రాన్ని' ఆలంబనగా చేసుకున్నారో, సరిగ్గా అందుకు వ్యతిరేకమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. పైగా 'నేను అధికార పార్టీలో లేను కనుక అభివృద్ధి చేయలేకపోయాను' అని ఆయన చేస్తున్న వాదనను ప్రజలు తోసిపుచ్చుతున్నారు. నిజానికి ఆ వాదనలోనే పస లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గం అభివృద్ధి జరగనప్పుడు, బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచినా అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? బీజేపీ కూడా ప్రతిపక్షమే కదా! కె.ఆర్.జి ఇంత చిన్న లాజిక్కు ఎట్లా మిస్సయ్యారో అంతు చిక్కదు. ప్రజలు తాను ఏమి చెప్పినా నమ్ముతారని ఎట్లా అనుకున్నారో ఆయనకే తెలియాలి. మునుగోడు నియోజకవర్గ ప్రజల రక్తంలో దశాబ్దాలుగా చైతన్యం ప్రవహిస్తోంది. అది భూమి కోసం, భుక్తి కోసం జరిగిన కమ్యూనిస్టుల పోరాటాల వల్ల కావచ్చు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మహత్తర పోరాటాల ప్రభావం వలన కావచ్చు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి చెబుతున్న మాటలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. మునుగోడు ప్రజలకు, అమాయకత్వానికి పొసగదు.

కె.ఆర్.జి సెల్ఫ్ గోల్ చేసుకున్నారనే అభిప్రాయం సాధారణ ఓటర్లలో వ్యక్తమవుతోంది. ఆయన 'అభివృద్ధి' కాన్సెప్ట్‌ వర్కవుటయ్యేలా లేదు. ఎమ్మెల్యే లేకపోవడంతో మునుగోడు ప్రజలకు ప్రజాప్రతినిధి లేకుండా పోయాడు.ఆ విధంగా ప్రజలకు ఆయన నష్టం కలిగించారన్న విమర్శలూ వస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని కె.ఆర్.జి చేస్తున్న ప్రచారం అధికారంలో ఉన్న టిఆర్ఎస్‌కే ప్రయోజనం కల్గించనుంది. అధికార పార్టీకి ఓటు వేస్తేనే నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి సాధ్యమన్న ప్రచారాన్ని ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి, ఇతర టిఆర్ఎస్ నాయకులు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కె.ఆర్.జి వ్యూహానికి జగదీశ్ రెడ్డి కౌంటర్ వ్యూహం పకడ్బందీగా రచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లో ఈ వ్యూహాన్ని మంత్రి అమలు చేస్తున్నారు.

టిఆర్ఎస్‌లో అసమ్మతి ఛాయలు కనిపించిన వెంటనే వాటిని మంత్రి జగదీశ్ రెడ్డి మొగ్గలోనే తుంచివేశారు. తనకు ఎలాంటి సమాచారం అందడం లేదంటూ మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ వ్యాఖ్యానించగానే కలకలం రేగింది. కానీ 'బూర నర్సయ్య మాటల్లో తప్పేమీ లేదు. సమాచార లోపం వల్ల ఇలా జరిగింది. అందరం కలిసే పనిచేస్తున్నాం' అని జగదీశ్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి పరిస్థితిని తక్షణం అదుపులోకి తీసుకొచ్చారు. అలాగే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి తమ పార్టీలో కొనసాగుతూ కోవర్టులుగా పనిచేస్తున్నట్టు, లేదా పనిచేసే అవకాశం ఉన్నట్టు తెలిసిన టిఆర్ఎస్ నాయకులను పార్టీ నుంచి ముందుగానే బయటకు పంపడంలోనూ మంత్రి జగదీశ్ రెడ్డి చాణక్యాన్ని ప్రదర్శించారు.

రాజగోపాలరెడ్డి 'త్యాగం' ఫలించేలా లేదు. ఆయన త్యాగంతో అభివృద్ధి కార్యకలాపాలు మునుగోడులో స్వైర విహారం చేస్తాయని అనుకున్నారు. కానీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యూహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తు చేశారు. ఇప్పటివరకు కొత్త జీవో ఏదీ మునుగోడు కోసం ప్రత్యేకంగా రాలేదు. ఆ నియోజకవర్గంలో కొత్తగా ప్రభుత్వం ఏమి చేబట్టినా అది తన ఖాతాలో వేసుకోవాలని కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ప్రయత్నిస్తున్నారు. అది పసిగట్టిన కేసీఆర్ ఎన్నికలకూ, అభివృద్ధికీ సంబంధం లేదని నిరూపించదలచుకున్నట్టు కనిపిస్తోంది. ఇది కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి మింగుడుపడడం లేదు. తనకు తాను గోతిలో పడడమే కాకుండా, బీజేపిని కూడా గోతిలో పడవేసేలా ఆయన రాజీనామా ప్రహసనం ఉన్నట్టు విశ్లేషణలు వస్తున్నాయి.

First Published:  11 Sept 2022 7:30 PM IST
Next Story