Telugu Global
Telangana

బీజేపీ రెండో లిస్టుపై కసరత్తు.. జనసేనకు 11 స్థానాలు!

దాదాపు గంట సేపు జరిగిన సీఈసీ సమావేశంలో సీట్ల కేటాయింపుపై విస్తృతంగా చర్చ జరిగింది.

బీజేపీ రెండో లిస్టుపై కసరత్తు.. జనసేనకు 11 స్థానాలు!
X

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి బీజేపీ 52 మందితో కూడిన తొలి జాబితాను ఇప్పటికే ప్రకటించింది. ఇక మలి జాబితాను విడుదల చేసేందుకు అధిష్టానం కసరత్తు పూర్తి చేసింది. గెలుపు గుర్రాలే లక్ష్యంగా రాష్ట్ర నాయకత్వం తయారు చేసిన మలి దశ జాబితాపై ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కూలంకషంగా సమీక్ష చేసింది. బుధవారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో సీఈసీ సమావేశం జరిగింది. తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోశ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే. లక్ష్మణ్ ఈ భేటీకి హాజరయ్యారు.

దాదాపు గంట సేపు జరిగిన సీఈసీ సమావేశంలో సీట్ల కేటాయింపుపై విస్తృతంగా చర్చ జరిగింది. బీసీలు, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంపై అధిష్టానం దృష్టి పెట్టింది. తొలి జాబితా తర్వాత అసంతృప్తులు పెరగడం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జి. వివేక్ సహా పలువురు నాయకులు పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో మలి జాబితాపై పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. మలి జాబితాలో కూడా బీసీలు, మహిళలకు సముచిత స్థానం దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా బీజేపీ అధికారంలోకి వస్తే బీసీకే ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ప్రకటించారు. అందుకే బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించడంపై దృష్టి పెట్టారు.

తెలంగాణలో జనసేనతో పొత్తు ఉండనున్నది. దీంతో ఇప్పటికే ప్రకటించిన 52 స్థానాలకు తోడు మలి దశ లిస్టులో 56 స్థానాలకు టికెట్లు ప్రకటించనున్నది. మిగిలిన 11 స్థానాలను జనసేనకు కేటాయించినట్లు తెలిసింది. కీలకమైన కూకట్‌పల్లి సీటును జనసేనకే ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ రోజు లేదా రేపు బీజేపీ రెండో లిస్టు విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

First Published:  2 Nov 2023 6:36 AM IST
Next Story