ఇక్కడ ఓడితే మరో ఉపఎన్నికకు ట్రై చేద్దాం.. సరికొత్త రాగం అందుకున్న బీజేపీ!
మునుగోడు ఏమీ సెమీఫైనల్ కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మునుగోడులో ఓడిపోతే మరో ఉపఎన్నికకు ప్లాన్ చేయాలని బీజేపీ భావిస్తున్నది.
మునుగోడు ఉపఎన్నిక గెలుపుపై పూర్తి ధీమా వ్యక్తం చేసిన బీజేపీ పార్టీలో క్రమంగా ఆ నమ్మకం సడలుతున్నట్లే కనిపిస్తున్నది. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీసీ ఓట్లు పోలరైజ్ అవుతాయని భావించింది. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయన వెంట దాదాపు 500 మంది కార్యకర్తలు, అభిమానులు తిరుగుతున్నారు. కానీ, పోల్ మేనేజ్‌మెంట్ విషయానికి వస్తే బీజేపీ పూర్తిగా వెనుకబడినట్లు తెలుస్తున్నది. బూత్ స్థాయిలో సరైన కార్యకర్తలు లేక రాజగోపాల్ ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై ప్రచారం బాగానే సాగుతుండటంతో పైకి అంతా సక్రమంగానే కనిపిస్తోంది. కానీ గ్రామాల్లో రాజగోపాల్‌కు అనుకూలంగా పని చేయడానికి చాలా మంది నిరాకరిస్తున్నట్లు సమాచారం.
మునుగోడు ఎన్నికలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ లాంటివని.. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇక్కడి నుంచే పతనం ప్రారంభం అవుతుందని బీరాలు పలికిన బీజేపీ ఇప్పుడు కొత్త రాగం అందుకున్నది. మునుగోడు ఏమీ సెమీఫైనల్ కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మునుగోడులో ఓడిపోతే మరో ఉపఎన్నికకు ప్లాన్ చేయాలని బీజేపీ భావిస్తున్నది. ప్రస్తుత ఉపఎన్నిక ఓడిపోతే.. ఇన్నాళ్లూ చెబుతూ వస్తున్న మాటలు ఉట్టివేనని తేలుతుందని.. పైగా కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. ఒకవైపు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ ఏకంగా మోడీపై యుద్దానికి సిద్ధమవుతుంటే.. మునుగోడు చేజార్చుకుంటే పార్టీకి తీరని నష్టమని అంచనా వేస్తున్నారు. అందుకే జీహెచ్ఎంసీ పరిధిలో మరో ఉపఎన్నిక వస్తుందని ప్రచారం చేయడం మొదలు పెట్టారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకమైన ఎమ్మెల్యే రాజీనామా చేస్తారంటూ బీజేపీ ఇటీవల భారీగా ప్రచారం చేసింది. బూర నర్సయ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే రాజీనామా చేసి బీజేపీలోకి వస్తారని.. జనవరి లేదా ఫిబ్రవరిలో మరో ఉపఎన్నిక వస్తుందంటూ లీకులు ఇస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది సమయం ఉందని.. తెలంగాణలో మరో ఉపఎన్నిక రావడం ఖాయమని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కూడా వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ నాయకులు మునుగోడుపై ఆశలు వదిలేసుకున్నారని.. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి మరో ఉపఎన్నికకు ప్లాన్ చేస్తున్నారనే విషయం అర్థం అవుతుంది. కానీ ఇప్పటికిప్పుడు టీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్లే ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. కానీ కావాలనే బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందని కొందరు అంటున్నారు. మునుగోడులో ఓటమి తప్పదని భావించే.. ఇప్పుడు కొత్త రాగం అందుకున్నదనే చర్చ జరుగుతున్నది.
మునుగోడులో ప్రచారం హోరాహోరీగా సాగుతున్న సమయంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి, సంస్థాగత ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్, రాష్ట్ర వ్యవహారాల సహ ఇంచార్జి అరవింద్ మీనన్ నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. ఒకవైపు ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర నాయకులు ఉండగానే.. ఎందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారనే డౌట్ అందరికీ వచ్చింది. కాగా, మునుగోడు తర్వాత మరో ఉపఎన్నికకు ప్లాన్ చేయాలని అధిష్టానం నుంచి ఆదేశాలు రావడంతోనే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తున్నది. మునుగోడుపై బీజేపీ జాతీయ నాయకత్వం కూడా అసంతృప్తిగా ఉందని.. రాజగోపాల్ ఓడిపోతే అది అతని ఖాతాలోనే వేసేద్దామనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తున్నది. రాజగోపాల్ రెడ్డి కూడా మొదట్లో చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ బలగాన్ని బీజేపీలోకి తీసుకొని రాలేకపోయారని, ఇప్పుడు క్షేత్ర స్థాయిలో కూడా తన అనుచరులు పూర్తి స్థాయిలో పని చేయడం లేదని పార్టీ భావిస్తోంది. ఇక్కడ ఓడిపోతే దాని బాధ్యతను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై వేసి మరో ఉపఎన్నికకు వెళ్లడం బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.