Telugu Global
Telangana

తెలంగాణలో బీజేపీ బలపడటం లేదు.. అధిష్టానానికి ఈటెల నివేదిక?

రాష్ట్రంలో బీజేపీ ఏ మాత్రం బలోపేతం కావడం లేదని.. ఎక్కడకు వెళ్లినా మతపరమైన కామెంట్లతో ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే మొదటికే మోసం వస్తుందని అమిత్ షాకు ఈటల చెప్పినట్లు సమాచారం.

తెలంగాణలో బీజేపీ బలపడటం లేదు.. అధిష్టానానికి ఈటెల నివేదిక?
X

తెలంగాణలో బీజేపీ క్షేత్ర స్థాయిలో బలపడటం లేదని.. హిందుత్వ అజెండాను నమ్ముకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కష్టమేనని ఈటల రాజేందర్ అధిష్టానికి తెలిపారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా‌ను కలిసిన హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఈ మేరకు నివేదిక అందించినట్లు తెలుస్తున్నది. కొంత కాలంగా రాష్ట్ర బీజేపీ రెండు వర్గాలుగా విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. హార్డ్ కోర్ హిందుత్వ సపోర్టర్లు, కొత్తగా పార్టీలో చేరిన వారు రెండుగా విడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లి అధిష్టానాన్ని కలవడం ఆసక్తికరంగా మారింది.

రాష్ట్ర బీజేపీలో విభేదాలు ఉన్నా.. ఇంత వరకు ఎవరూ ఢిల్లీ వరకు వెళ్లి ఫిర్యాదులు చేయలేదు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిపై ఎలాంటి నివేదిక ఇవ్వలేదు. ఢిల్లీ నుంచి అగ్రనాయకులు తెలంగాణ వచ్చినా.. నోరు మెదపకుండానే ఉన్నారు. అయితే కర్ణాటకలో బీజేపీ ఓటమి తర్వాత ఇక్కడి నాయకులకు మాట్లాడే ధైర్యం వచ్చింది. అందుకే ఈటల కూడా ఏకంగా ఆరు పాయింట్లతో కూడిన నివేదికను తీసుకెళ్లి అమిత్ షాకు ఇచ్చినట్లు తెలుస్తున్నది.

రాష్ట్రంలో బీజేపీ ఏ మాత్రం బలోపేతం కావడం లేదని.. ఎక్కడకు వెళ్లినా మతపరమైన కామెంట్లతో ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే మొదటికే మోసం వస్తుందని అమిత్ షాకు ఈటల చెప్పినట్లు సమాచారం. దక్షిణ భారతదేశంలో ఇలా హిందుత్వను ముందేసుకొని అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేమని స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది. తెలంగాణలో సెక్యులర్ భావాలు కలిగిన వారు ఎక్కువగా ఉంటారు. అర్బన్ ఏరియాల్లో ఇప్పటికే బీజేపీ హిందుత్వ అజెండాపై విముఖత పెరుగుతోంది. మరోవైపు రూరల్ ఏరియాల్లో బీజేపీకి అసలు పట్టేలేదు అని ఈటల చెప్పినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.

హైదరాబాద్ పేరు మారుస్తాం, ముస్లిం కోటాను రద్దు చేస్తాం, హిజాబ్ వంటి విషయాలు తెలంగాణలో బీజేపీకి మైనస్‌గా మారాతాయని ఈటల నివేదించారు. అంతే కాకుండా రాష్ట్రంలో పార్టీ నాయకత్వం సరిగా లేదని కూడా చెప్పినట్లు సమాచారం. కాగా, దేశవ్యాప్తంగా బీజేపీ హవా నడుస్తున్నా.. టాప్ పోస్టుల్లో మాత్రం ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారినే నియమించింది. అస్సాంలో హిమంత బిశ్వ శర్మ బీజేపీలోకి వచ్చినా.. ఒక టర్మ్ పాటు అతడికి ఏ పదవీ ఇవ్వని విషయాన్ని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.

ఈ క్రమంలో హార్డ్ కోర్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యక్తి అయిన బండి సంజయ్‌ను పక్కన పెట్టి కొత్తగా పార్టీలో చేరిన వారికి ముఖ్యమైన బాధ్యతలు ఇవ్వకపోవచ్చు. అయినా సరే ఈటల రాజేందర్ మాత్రం పార్టీలో ప్రక్షాళన జరగాలని కోరుతూ ఢిల్లీలో అధిష్టానానికి నివేదిక ఇచ్చారు. అంతే కాకుండా రాబోయే ఎన్నికల్లో హిందుత్వను పక్కన పెట్టాలని సూచించారు. ఇవన్నీ బీజేపీ అగ్రనాయకత్వం అమలు చేస్తుందా అనేది అనుమానమే. అయితే.. తెలంగాణలో రెండు వర్గాలుగా విడిపోయిన పార్టీని ఐక్యం చేయడానికి మాత్రం అధిష్టానం ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

ఈ నెల 30 నుంచి నెల రోజుల పాటు రాష్ట్ర పార్టీ శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. హోం మంత్రి అమిత్ షాతో పాటు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొననున్నారు. ఆ సమయంలో ఇరు వర్గాలతో సమావేశమై వారి మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

First Published:  18 May 2023 9:24 AM IST
Next Story