Telugu Global
Telangana

మునుగోడు ఉపఎన్నికపై తల పట్టుకుంటున్న బీజేపీ.!

గత కొన్ని రోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనికి కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ వెంట వచ్చిన కొంత మంది నాయకులు తప్ప.. బీజేపీ కార్యక్తలు హాజరుకావడం లేదు. ఇప్పటికీ రాజగోపాల్‌ను ఓన్ చేసుకోవడానికి మునుగోడు బీజేపీ నాయకత్వం వ్యతిరేకంగా ఉందని సమాచారం.

మునుగోడు ఉపఎన్నికపై తల పట్టుకుంటున్న బీజేపీ.!
X

కోరి తెచ్చుకున్న ఉపఎన్నికపై బీజేపీ తల పట్టుకుంటోందా? అంతా సజావుగా సాగిపోయి మునుగోడులో కూడా హూజూరాబాద్ ఫలితాన్ని రిపీట్ చేస్తామన్న అంచనాలు తలకిందులుగా మారిపోతున్నాయా? కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సహకరించడంపై స్థానిక బీజేపీ నాయకత్వం సుముఖంగా లేదా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. గత కొన్ని రోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనికి కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ వెంట వచ్చిన కొంత మంది నాయకులు తప్ప.. బీజేపీ కార్యక్తలు హాజరుకావడం లేదు. ఇప్పటికీ రాజగోపాల్‌ను ఓన్ చేసుకోవడానికి మునుగోడు బీజేపీ నాయకత్వం వ్యతిరేకంగా ఉందని సమాచారం.

గత కొన్ని రోజులుగా చేస్తున్న ప్రచార కార్యక్రమాల్లో తనకు బీజేపీ నుంచి సరైన సహకారం లభించకపోవడంతో రాజగోపాల్ వెంటనే రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రచారంలో ఎవరూ సహకరించడం లేదని, పిలుద్దామని అనుకున్నా ఫోన్లు స్విచ్ఛాఫ్ పెట్టుకున్నారని తెలిపినట్లు సమాచారం. వాస్తవానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రాజీనామా చేయకముందు బీజేపీ అతడిపై తీవ్రమైన వ్యతిరేక ప్రచారం చేసింది. క్షేత్రస్థాయిలో అతడికి వ్యతిరేకంగా పోస్టర్లు కూడా ముద్రించింది. రాజగోపాల్ ఓ 'అవినీతి గద్ద' అని రాసిన పోస్టర్లను బీజేపీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గం అంతా అతికించారు. అలాంటి పరిస్థితి ఒక్కసారిగా మారిపోవడంతో ఏం చేయాలో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు పాలుపోవడం లేదు.

నిన్న, మొన్నటి వరకు తిట్టిన వ్యక్తినే.. ఇప్పుడు తమ అభ్య‌ర్థిగా ఎలా చెప్పుకొని తిరగాలని ప్రశ్నిస్తున్నారు. అసలు రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి రావడం కూడా స్థానిక నాయకత్వానికి ఇష్టం లేదు. దీంతో బీజేపీలోని ముఖ్య నాయకులు అందరూ కోమటిరెడ్డికి దూరంగా ఉంటున్నారు. అయితే, రాజగోపాల్ రెడ్డి ఫిర్యాదుతో బీజేపీ రాష్ట్ర నాయక్వంలో కదలిక వచ్చింది. మునుగోడు అసెంబ్లీ ఇంచార్జి, గత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన గంగిడి మనోహర్ రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ ప్రదీప్ కుమార్‌ను మునుగోడుకు పంపించారు.

బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర రాష్ట్ర ప్రముఖ్‌గా గంగిడి మనోహర్ రెడ్డి ఉన్నారు. ఇవ్వాళ్టి నుంచి నాలుగో విడుత యాత్ర ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ మనోహర్ రెడ్డి దగ్గరుండి చూసుకుంటున్నారు. అయితే త్వరలో ఉపఎన్నిక రాబోతుండటంతో మనోహర్ రెడ్డితో మాట్లాడి సంజయ్ అతడిని రాజగోపాల్‌కు తోడుగా పంపించారు.

వీరిద్దరితో పాటు జాయినింగ్స్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ కూడా రాజగోపాల్ రెడ్డితో పాటు నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, టీఆర్ఎస్ బలంగా ఉన్న మునుగోడులో గెలవాలంటే కష్టపడక తప్పదని.. హూజూరాబాద్‌కు ఈ ఎన్నికకు చాలా తేడా ఉందని స్థానిక నాయకత్వానికి వీరంతా చెప్తున్నారు. ఎలాగైనా ప్రచారానికి రప్పించడానికి రాష్ట్ర నాయకత్వం స్థానిక నాయకులను బుజ్జగించిందని తెలుస్తోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జి సునీల్ బన్సల్ ఇప్పటికే స్థానిక నాయకులతో మాట్లాడి.. వారందరికీ వేర్వేరుగా ప్రచార బాధ్యతలు అప్పగించారు. నాయకుల్లో ఏవైనా అసంతృప్తి ఉంటే ఉపఎన్నిక తర్వాత చూసుకుందామని.. ప్రస్తుతానికి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయాలని వారిని కోరారు. మరి ఇంత మంది బుజ్జగించిన తర్వాత అయినా స్థానిక నాయకత్వం రాజగోపాల్ వెంట నడుస్తుందో లేదో చూడాలి.

First Published:  12 Sept 2022 12:30 PM GMT
Next Story