నిజాం షుగర్స్ మూసివేతలో బీజేపీ కూడా భాగం.. సీఎం కేసీఆర్ రైతులను ఆదుకున్నారు
ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడంలో నాటి సీఎం చంద్రబాబుతో పాటు అప్పటి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కూడా పాత్ర ఉన్నదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
నిజాం షుగర్స్ మూసివేతపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చెప్పేవన్నీ అబద్దాలేనని.. ఆనాడు బీజేపీ సహాయంతో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఫ్యాక్టరీని పూర్తిగా ముంచేశాయని కార్మిక సంఘ నాయకులు అంటున్నారు. తెలంగాణ ఏర్పడిన మరుసటి ఏడాదే నిజాం షుగర్స్ యాజమాన్యం 2015-16 సీజన్‌లో చెరుకును క్రషింగ్ చేయకుండా రైతులకు అన్యాయం చేసింది. ఆ సమయంలో సీఎం కేసీఆర్ చొరవ తీసుకొని ఇతర ఫ్యాక్టరీలకు చెరుకును మళ్లించారు. పైగా, రైతులపై భారం పడకుండా రవాణా ఖర్చులను బీఆర్ఎస్ ప్రభుత్వమే భరించిందని కార్మికులు చెబుతున్నారు.
నిజాం దక్కన్ షుగర్స్ యాజమాన్యం బోధన్‌లోని ఫ్యాక్టరీతో పాటు డిస్టిలరీ, మెట్‌పల్లి, మెదక్ యూనిట్లకు 2015 డిసెంబర్ 22న అర్ధరాత్రి లే ఆఫ్ ప్రకటించింది. అప్పటికే ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుందామని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఇది పెద్ద అడ్డంకిగా మారింది. ఒక వేళ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ జరిగినా.. రైతులు చెరుకును సాగు చేస్తారనే నమ్మకం పోయింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ నడవాలంటే 10 లక్షల టన్నుల మేరకు చెరుకు అవసరం ఉంటుంది. ఇంత మొత్తంలో చెరుకు అందకపోతే ఫ్యాక్టరీ ఓపెన్ చేసినా తిరిగి నష్టాల పాలయ్యే అవకాశం ఉంటుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది.
ఆసియాలోనే అతిపెద్ద చక్కెర ఫ్యాక్టరీగా ప్రసిద్ధికెక్కిన నిజాం షుగర్స్.. సీమాంధ్ర పాలకుల కారణంగా ప్రైవేటుపరం అయ్యింది. ఉమ్మడి రాష్ట్రంలోని హిందూపూర్, మిర్యాలగూడ, లచ్చాయిపేట్‌లో ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ యూనిట్లను ఆనాటి పాలకులు అమ్మేశారు. 2002 వరకు దీనికి అనుబంధంగా ఉన్న డిస్టిలరీలను కూడా నాటి సీఎం చంద్రబాబు అమ్మకానికి పెట్టారు. లాభాలను అర్జిస్తున్న శక్కర్‌నగర్, మెట్‌పల్లి, మెదక్ యూనిట్లను అమ్మేశారు. ఈ యూనిట్లన్నింటినీ ప్రైవేటుపరం చేయవద్దని ఆనాడు ఆందోళన చేసింది బీఆర్ఎస్ పార్టీనే అని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.
ఆంధ్ర ప్రాంతీయుడు అయిన గోకరాజు గంగరాజుకు చెందిన డెల్టా పేపర్స్‌కు నిజాం షుగర్స్‌ను జాయింట్ వెంచర్ పేరుతో ప్రైవేటుపరం చేశారు. ఇందులో ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉంటే.. డెల్డా పేపర్ మిల్స్‌కు 51 శాతం వాటా ఉన్నది. ఎక్కువ వాటా ఉండటంతో వాళ్లు చెప్పిందే బోర్డులో చెల్లుబాటు అయ్యేది. కంపెనీలోని ఐదుగురు డైరెక్టర్లలో ముగ్గురు వాళ్లే ఉన్నారు. దీంతో ఫ్యాక్టరీపై పూర్తి పెత్తనం వారిదే ఉండేది. ఆనాడు టీడీపీ సీఎం చంద్రబాబు నాయుడు లాభాల్లో ఉన్న నిజాం షుగర్స్‌ను ప్రైవేటుపరం చేసి కార్మికులు, కర్షకులను ముంచేశారు. ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడంలో నాటి సీఎం చంద్రబాబుతో పాటు అప్పటి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కూడా పాత్ర ఉన్నదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇవన్నీ చెప్పకుండా రాష్ట్ర బీజేపీ నాయకులు తప్పంతా బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై నెట్టేస్తున్నారు.
2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఒత్తిడి మేరకు సభా సంఘాన్ని నియమించింది. నిజాం షుగర్స్ ప్రైవేటీకరణ అక్రమమని, ఇందుకు కారణమైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఫ్యాక్టరీని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సభా సంఘం సిఫార్సు చేసింది. కానీ, నాటి కాంగ్రెస్ పాలకులు 2014 వరకు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకున్న ప్రైవేటు యాజమాన్యం మొదటి రెండు మూడేళ్లు లాభాలు చూపించినా.. ఆ తర్వాత పూర్తిగా నష్టాలు వచ్చినట్లు చూపి.. ఫ్యాక్టరీని సంక్షోభంలోకి నెట్టేశారని కార్మిక సంఘ నాయకులు చెబుతున్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015 ఏప్రిల్ 29న జీవో 28ని జారీ చేశారు. దీని ప్రకారం నిజాం షుగర్స్‌ను స్వాధీనం చేసుకొని.. సహకార పద్దతిలో రైతులకే అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఎలా అమలు చేయాలో అధ్యయనం చేసేందుకు ఒక బృందాన్ని సీఎం కేసీఆర్ స్టడీ టూర్‌కు మహారాష్ట్రకు పంపించారు. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి 400 మంది రైతులను తీసుకొని అక్కడకు వెళ్లారు. అయితే రైతులు చక్కెర ఫ్యాక్టరీని నడపలేమని నిరాసక్తత వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు కూడా వారికి ఫ్యాక్టరీ నడపవద్దని సలహాలు ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు ఫ్యాక్టరీ తెరుచుకోలేదు.
మరో వైపు 2014లో ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్ చేయకపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. దీంతో తెలంగాణ సర్కారు జోక్యం చేసుకొని యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చింది. దీంతో ఆ ఏడాది క్రషింగ్ చేశారు. రైతులకు ఇవ్వాల్సిన బిల్లులు కూడా ఇవ్వకపోతే ప్రభుత్వమే రూ.11.26 కోట్లను చెల్లించింది. మొత్తంగా రూ.66 కోట్ల మేరకు చెరుకు రైతులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించిందని కార్మికులు, రైతులు చెబుతున్నారు. నిజాం షుగర్స్ మూయించేయడంలో టీడీపీ, కాంగ్రెస్‌లతో పాటు బీజేపీ పార్టీకి కూడా పాపం ఉన్నది. ఈ నిజాలన్నీ బయటకు చెప్పకుండా.. రైతులను ఆదుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై మాత్రం నిందలు వేస్తున్నారని కార్మిక సంఘ నాయకులు అంటున్నారు.