ఎమ్మెల్యేల బేరసారాల ఆడియో లీక్.. పైలెట్‌తో స్వామీ రామచంద్రభారతి మంతనాలు
నందకుమార్ ఈ బేరసారాలకు మీడియేటర్‌గా ఉన్నట్లు అర్థం అవుతోంది. పైలెట్ రోహిత్ రెడ్డికి స్వామీజీని ఆయనే పరిచయం చేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఫామ్‌హౌస్‌లో ప్రలోభాలకు గురి చేసి, పార్టీ మారేలా చేయడానికే స్వామీ రామచంద్ర భారతి, నందకుమార్, సతీశ్ అక్కడకు వచ్చారని తెలిపే సాక్ష్యం ఒకటి బయటకు వచ్చింది. బీజేపీకి చెందిన మధ్య వర్తులు నేరుగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కాల్ చేసి బేరసారాలు మాట్లాడినట్లు ఆ ఆడియోలో స్పష్టంగా తెలుస్తున్నది. ఫామ్‌హౌస్‌కు రాకముందే స్వామీజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో టచ్‌లో ఉన్నారు. నందకుమార్ ఈ బేరసారాలకు మీడియేటర్‌గా ఉన్నట్లు అర్థం అవుతోంది. పైలెట్ రోహిత్ రెడ్డికి స్వామీజీని ఆయనే పరిచయం చేశారు. హైదరాబాద్ రాక ముందే స్వామీ రామానందర భారతి ఒక గ్రూప్ కాల్‌లో రోహిత్ రెడ్డితో మాట్లాడారు. అక్కడ మరింత మంది ఎమ్మెల్యేలను తీసుకొని రావాలని, వారి పేర్లు చెప్పాలని స్వామీజీ ఒత్తిడి తెచ్చారు. ఆ సంభాషణ ఇలా సాగింది.
(గ్రూప్ కాల్‌లోకి పైలెట్ రోహిత్ రెడ్డిని తీసుకున్నారు.)
రోహిత్ : హాలో.. హలో
(స్వామీజీ మాట్లాడండీ.. అంటూ నందు చెప్పాడు)
స్వామీజీ : నమస్కార్
రోహిత్ : నమస్కార్ స్వామీజీ. ఎలా ఉన్నారు?
స్వామీజీ : చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు?
రోహిత్ : నేను కూడా బాగున్నాను స్వామీజీ
స్వామీజీ : ఇప్పుడు కొన్ని మాటలు మాట్లాడుకుంటున్నాము. నందు, నాకు మధ్య నడుస్తున్నాయి. అయితే.. మాకు కొంచెం పూర్తి వివరాలు ఇస్తే.. అక్కడ (హైకమాండ్) మాట్లాడతాను. ఇప్పటికే వాళ్లు ఓకే చెప్పారు.
రోహిత్ : హా.. స్వామీజీ
స్వామీజీ : మీరు ఒకసారి ఆ పేర్లు మాకు చెబితే.. నాకు కొంచెం పని సులువు అవుతుంది.
రోహిత్ : స్వామీజీ.. ఇప్పుడు పేర్లు చెప్పడం కాస్త కష్టం అవుతుంది. అయితే, నాకు ఇద్దరు కన్ఫార్మ్ చేశారు. మనం ఒకసారి కలిసి మాట్లాడుకుంటే బాగుంటుంది కదా స్వామీజీ.
స్వామీజీ : హా హా.. తప్పకుండా తప్పకుండా. అయితే 24 వరకు నేను కొంచెం బెడ్ రెస్ట్‌లో ఉన్నాను. అప్పటి వరకు నేను రాలేను. అయితే 24 తర్వాత ఒక రోజు వస్తాను. హైదరాబాద్ లేదా ఇంకెక్కడైనా. హైదరాబాద్ వద్దులే కానీ మరెక్కడైనా కూర్చొని మాట్లాడుకుందాం.
రోహిత్ : అయితే, ఒక ప్రాబ్లెం ఉంది స్వామీజీ. మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ ఎలక్షన్ జరుగుతోంది. మా మీద కూడా నిఘా ఉంటుంది. అందుకే హైదరాబాద్ అయితేనే బెస్ట్ ప్లేస్. ఎందుకంటే మేమందరం కూడా హైదరాబాద్‌లోనే ఉంటాము.
స్వామీజీ : అట్లయితే ఓకే.
రోహిత్ : సరే హైదరబాద్‌లో కూర్చుందాం. అయితే మీకు డేట్ కావాలి కదా.. నందు కూడా అడుగుతున్నాడు. సంతోశ్ జీ కూడా చర్చలకు వస్తారని చెబుతున్నారు. మనం కూడా డిస్కస్ చేయవచ్చని నందు అంటున్నాడు.
స్వామీజీ : అవును అవును. నేను మార్నింగ్ ఈ విషయాలు ఆయనకు చెప్తాను. మేం మాట్లాడుకుంటాము. అయితే బల్క్ సిద్దంగా (అంటే పెద్ద మొత్తంలో ఎమ్మల్యేలు) ఉంటే సంతోశ్ తప్పకుండా వస్తారు.
రోహిత్ : అయితే ఇప్పుడు నాతో కలిపి ముగ్గురు రెడీగా ఉన్నారు.
స్వామీజీ : మనం ఏం చేద్దాం అంటే.. 24 తర్వాత నేను హైదరాబాద్ వస్తాను. మనం కూర్చొని మాట్లాడుకుందాము. అదైతే మంచిగా ఉంటుంది. ఫైనల్ డెషిషన్ ఆ రోజే తీసుకొని మనం ముందుకు వెళ్దాం.
రోహిత్ : సరే. మనం అలా చేద్దాం. (రోహిత్ కాస్త నసుగుతూ ఉండగా)
స్వామిజీ : మీరు నందూతో ఏం మాట్లాడారో.. ఆ విషయంలో ఎలాంటి సమస్య లేదు.
రోహిత్ : వాస్తవానికి నందూ ఏం చెప్పారంటే.. ఆయనే ప్రపోజల్ పెట్టారు. నన్ను అన్ని రకాలుగా చూసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. నా సెక్యూరిటీ, నా పొలిటికల్ కెరీర్, ఇతర విషయాల్లో మేం చూసుకుంటామన్నారు.
స్వామీజీ : మీ ముందే అన్నీ మాట్లాడతారు. నెంబర్ 2 ముందు వీటికి భరోసా ఇస్తాను. దీని మీద ఎలాంటి సమస్యలు లేవు. మొదట వచ్చిన వారికే మొదట వడ్డించబడుతుంది. అలా చూసినా మిమ్మల్ని మేము ప్రమోట్ చేస్తాము.
రోహిత్ : చూడండి. నేను కూడా ఆసక్తిగానే ఉన్నాను. మీకు నా గత చరిత్ర గురించి తెలుసు. అత్యున్నత స్థాయిలో నేను వర్క్ చేయాలని అనుకుంటున్నాను.
స్వామీజీ : అవును మాకు తెలుసు. మనం ఈ విషయాలన్నీ ఫోన్లో ఇలా సుదీర్ఘంగా మాట్లాడుకోవడం అంత మంచిది కూడా కాదు. నేనేమంటానంటే.. నువ్వు డైరెక్ట్‌గా నందుతో మాట్లాడు. నందుకు కూడా చెప్పాను... సంతోశ్‌తో నేరుగా కలిసి మాట్లాడమని. దాన్లో నాకేమీ అభ్యంతరం లేదు. ఆయన కూడా ఓపెన్‌గా చెప్పారు. మీరు ప్రపోజల్ పట్టుకొని రండి.. మీరు చెప్పినట్లే చేసేద్దాం అన్నారు.
రోహిత్ : ఓకే
స్వామీజీ : అంతే..
రోహిత్ : నేను మీ కోసం 24న వెయిట్ చేస్తుంటాను.
స్వామీజీ : 24 కాదు. నేను బెడ్ రెస్టులో ఉన్నాను. 25న నేను వస్తాను. అప్పుడే అక్కడ మీకు సెట్ చేసేస్తాము.
రోహిత్ : నేను అంత తొందరపడటం లేదు. కానీ, నందు చెప్తున్నాడు.. రేపు రేపు రేపు అంటున్నాడు.
స్వామీజీ : నందు కాదు. నాకే కొంచెం ప్రెజర్ ఉన్నది. నందు క్లియర్‌గానే ఉన్నాడు. ఎలక్షన్ ముందు ఇది సెట్ చేస్తే.. దాని ఫలితం వేరే దగ్గర కూడా ఉంటుంది. అంతే కాకుండా మాకు మంచి లీడర్లు కూడా అవసరం ఉన్నది. అందుకే మేము తొందర పడుతున్నాము. అందుకే నేను నందుపై ప్రెజర్ పెడుతున్నాను.
రోహిత్ : ఓకే
స్వామీజీ : చివరి ఐదు రోజుల నుంచి నందు నిద్రపోలేదు. చాలా కష్టపడి పని చేస్తున్నాడు. ఆయన మరి కొంత మందిని కూడా తీసుకొచ్చాడు. కానీ మాకు వాళ్ల కంటే మీలాంటి వాళ్లే కావాలని అన్నాము. అందుకే నందు ఇంత కష్టపడుతున్నాడు.
రోహిత్ : అవును, మీరు ఆ రోజు మీరు కూడా నన్ను మెచ్చుకున్నారు. నేను అర్థం చేసుకున్నాను.
స్వామీజీ : ఇది హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్. ఇందులో ఎలాంటి సమస్య లేదు. మనం కూర్చొని మాట్లాడుకుందాం. మీరు ఇంకో ఇద్దరు ముగ్గురిని తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. మాకు కూడా సులభంగా ఉంటుంది. మనం 26న కలుద్దాం. లేదంటే 25న కలుద్దాము.
నందకుమార్ : వద్దు స్వామీజీ. 25న గ్రహణం ఉంది కదా.. ఆ రోజు బాగుండదేమో.
స్వామీజీ : అయితే 26న కూర్చుందాం. మీరు మరోసారి వాళ్లతో మాట్లాడండి.
(అక్కడ ముగ్గురు కలిసి కూర్చునే సమయానికి ఎవరెవరిని తీసుకొని రావాలి. వారికి సమాచారం ఎలా అందించాలని డిస్కస్ చేశారు)
26న మీటింగ్ ఫిక్స్ అవడంతో నెంబర్ 2తో మాట్లాడటానికి తుషార్ వెళ్లినట్లు స్వామీజీ చెప్పారు. ఈ విషయం గురించి డిస్కషన్ జరుగుతుండగానే రోహిత్ రెడ్డి భయపడ్డారు. మీకు తెలుసు కదా స్వామీజీ మా సీఎం గురించి. మనం ఎక్కువ మంది కోసం ప్రయత్నాలు చేస్తుంటే.. నా విషయం కనుక బయటపడితే నా పని అయిపోతుంది అని రోహిత్ రెడ్డి అన్నారు. ఆయన చాలా కోపిష్టి మనిషి. కాబట్టి మరింత మంది కోసం ప్రయత్నించడం కంటే.. ఇప్పుడున్న ముగ్గురితో ముందుకు వెళ్దామని రోహిత్ అన్నాడు.
అందుకే నేను ఆ ముగ్గురి పేర్లు కావాలని అడుగుతున్నానని స్వామీజీ అన్నారు. కాగా, ఇప్పుడు ఆ పేర్లు చెప్పలేను. నన్ను అర్థం చేసుకోండని రోహిత్ రెడ్డి అన్నారు. అయితే నెంబర్ 2 ముందు ఆ పేర్లు చెప్పగలవా అని స్వామీజీ ప్రశ్నించగా.. ఆయన ముందైతే చెప్తానని రోహిత్ బదులిచ్చాడు.
సంతోశ్ బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ.. ఆయన చాలా కీ పర్సన్. అన్ని పనులు ఆయనే చూస్తుంటారు. బీఎల్ సంతోశ్ మాత్రమే ప్రభుత్వం చేయాల్సిన పనులను కూడా డిసైడ్ చేస్తుంటారు. అందుకే అందరూ సంతోశ్ ఇంటికి వచ్చి మాట్లాడతారు. అంతే కాని ఆయన ఎవరి దగ్గరకు వెళ్లరు. ఏ నిర్ణయం అయినా సంతోశ్ మాత్రమే తీసుకుంటారు. నెంబర్ 1 అయినా నెంబర్ 2 అయినా సంతోశ్ చెప్పిందే చేస్తారు. మీకు మిగిలిన విషయాలు రేపు కూర్చున్నప్పుడు చెప్తాను. నేను సంతోశ్‌కు కూడా చెప్తాను. మీ పేర్లు మధ్య వ్యక్తులకు అసలు చెప్పను అని స్వామీజీ చెప్పుకొచ్చారు.
కాగా, ఈ విషయాన్ని పూర్తి సీక్రెట్‌గా ఉంచండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.. దీన్ని బయటకు మాత్రం తీసుకొని రావొద్దని రోహిత్ రెడ్డి స్వామీజీని కోరారు. మీరు మా రెస్పాన్సిబిలిటీ అని.. ఐటీ నుంచి ఈడీ వరకు మేం చూసుకుంటామని స్వామీజీ అన్నారు.