Telugu Global
Telangana

ఈటల సీఎం..? బండితో కయ్యం.. హైకమాండ్ గరంగరం..

కాబోయే సీఎం ఈటల, బీజేపీ పులి ఈటల, ముదిరాజ్ ముద్దుబిడ్డ ఈటల అంటూ నినాదాలు చేశారు. దీంతో సహజంగానే బీజేపీ సీనియర్లకు కాస్త ఇగో హర్ట్ అయింది.

ఈటల సీఎం..? బండితో కయ్యం.. హైకమాండ్ గరంగరం..
X

ఈటల రాజేందర్ నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చారు. గతంలో తెలంగాణ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నా కూడా.. బీజేపీలో ఆయన ఇంకా జూనియర్ ఆర్టిస్టే అనుకోవాలి. అయితే ఈటల అనుచరులు మాత్రం ఆయన్ని హీరోగా మోసేస్తున్నారు. ఏకంగా సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ విషయం గతంలోనే హైకమాండ్ దగ్గరకు వెళ్లడంతో చీవాట్లు పెట్టింది. ఆ కోపాన్ని ఈటల కూడా తన అనుచరులపై చూపించారు. ఇకపై అలాంటి స్లోగన్లు ఇవ్వొద్దని సున్నితంగా హెచ్చరించారు. కానీ మళ్లీ సీన్ రిపీటైంది. కాబోయే సీఎం ఈటల అంటూ ముదిరాజ్ నేతలు రచ్చ రచ్చ చేశారు. దీంతో మరోసారి హైకమాండ్ ముందు ఈటల చేతులు కట్టుకోవాల్సి వచ్చింది.

హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి చైర్మన్ కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి ఉత్సవాలు బోయగూడలోని ముదిరాజ్ భవన్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి ఈటల రాజేందర్ హాజరయ్యారు. అయితే అక్కడే ఉన్న ముదిరాజ్ నేతలంతా ఆయన్ను కాబోయే సీఎంగా అభివర్ణిస్తూ హడావిడి చేశారు. కాబోయే సీఎం ఈటల, బీజేపీ పులి ఈటల, ముదిరాజ్ ముద్దుబిడ్డ ఈటల అంటూ నినాదాలు చేశారు. దీంతో సహజంగానే బీజేపీ సీనియర్లకు కాస్త ఇగో హర్ట్ అయింది. తెలంగాణ సీఎంగా తనని తాను ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటున్న బండి సంజయ్ కి మరింత మండింది. ఇటీవల బండి సంజయ్ కి తెలియకుండా మునుగోడులో క్రైమ్ హిస్టరీ ఉన్న నేతలకు పార్టీ కండువా కప్పారు ఈటల. ఆ వ్యవహారంలోనే ఇద్దరి మధ్య దూరం బాగా పెరిగింది. ఇప్పుడు సీఎం కుర్చీ విషయంలో తనకి పోటీదారుగా ఈటల ఎలివేట్ అవుతున్నారనే విషయం తెలియడంతో బండి మరింతగా రగిలిపోతున్నారు.

ఆలూ లేదు, చూలూ లేదు..

తెలంగాణలో బీజేపీ మూడు ఎమ్మెల్యే స్థానాలున్న పార్టీ. వచ్చే దఫా ఏకంగా అధికారానికే గాలం వేయాలనుకుంటోంది. ఆశపడటంలో తప్పులేదు కానీ, మరీ అది దురాశేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే కష్టం అనుకుంటే.. ఒకవేళ వస్తే సీఎం ఎవరనే చర్చ కూడా జోరందుకుంటోంది. బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఇలా చాలామంది ఈ పోస్ట్ కోసం కాచుకు కూర్చున్నారు. వీరంతా కరడుగట్టిన బీజేపీ నేతలు. అయితే నిన్నగాక మొన్న వచ్చిన ఈటల రాజేందర్ ఏకంగా సీఎం పోస్ట్ కే ఎసరు పెట్టాలనుకోవడం చర్చనీయాంశమైంది. బీజేపీ గెలుస్తుందా లేదా అనే విషయం పక్కనపెడితే ఎవరికి వారే సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసుకోవడం బీజేపీ ఆనవాయితీ కాదు. సంజయ్ కూడా ఈ విషయంలో సైలెంట్ గానే ఉంటున్నారు. ఈ దశలో కార్యకర్తలు, అభిమానుల అత్యుత్సాహం ఈటలకు హైకమాండ్ నుంచి చీవాట్లు తెచ్చిపెడుతోంది. ఈటల సీఎం స్లోగన్లు రెండోసారి రిపీటవడంతో అధిష్టానం మరింత గరంగరంగా ఉందని తెలుస్తోంది.

First Published:  20 Aug 2022 8:40 AM IST
Next Story