తెలంగాణలో ఫిరాయింపులు బీజేపీకి సంతోషమే..
రాజీనామాలు చేయకుండా ఒక్కొక్కరే బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరడం.. రాజ్యాంగ విరుద్ధం అని కూడా కిషన్ రెడ్డి చెప్పలేదు. కాంగ్రెస్ బలపడుతున్నా.. బీఆర్ఎస్ బలహీన పడుతోందనే సంతోషం బీజేపీలో ఎక్కువగా కనపడుతోంది.
తెలంగాణలో రోజుకో ఎమ్మెల్యే బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఎమ్మెల్సీలు కూడా అదే బాట పట్టారు. అసలు లేజిస్లేటివ్ పార్టీ మొత్తాన్ని కాంగ్రెస్ లో విలీనం చేస్తారంటూ దానం నాగేందర్ వంటి వారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పొలిటికల్ జంపింగ్ లను బీజేపీ ఆసక్తికరంగా గమనిస్తోంది. కాంగ్రెస్ వైఖరిని ఖండించాలని ఉన్నా.. లోలోపల బీఆర్ఎస్ కి నష్టం జరుగుతోందని బీజేపీ సంబరపడుతోంది.
ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ కూడా వెళ్తోందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గాంధీ భవన్ కు, తెలంగాణ భవన్ కు తేడా లేదని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యేలను మాత్రం తనవైపు తిప్పుకుంటోందని అన్నారు కిషన్ రెడ్డి. అయితే ఇక్కడ కాంగ్రెస్ చర్యలను ఆయన ఏమాత్రం ఖండించకపోవడం విశేషం. రాజీనామాలు చేయకుండా ఒక్కొక్కరే బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరడం.. రాజ్యాంగ విరుద్ధం అని కూడా కిషన్ రెడ్డి చెప్పలేదు. కాంగ్రెస్ బలపడుతున్నా.. బీఆర్ఎస్ బలహీన పడుతోందనే సంతోషం బీజేపీలో ఎక్కువగా కనపడుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలమైన ఫలితాలు రాకపోయినా.. లోక్ సభ ఎన్నికలనాటికి తెలంగాణలో బీజేపీ బలం పెరిగిందని అన్నారు కిషన్ రెడ్డి. బీజేపీకి ఓట్లు, సీట్లు ఇచ్చిన తెలంగాణ ప్రజలకు సెల్యూట్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్‌గిరి గడ్డపై కూడా కాషాయ జెండా ఎగిరిందని గుర్తు చేశారు. రేవంత్ సొంత జిల్లాలోనూ బీజేపీ ఆధిపత్యం సాధించిందన్నారు. పార్టీ ఓటు బ్యాంకు 14 నుంచి 35 శాతానికి పెరిగిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అతి తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందని చెప్పారు కిషన్ రెడ్డి. గతంలో కూడా తెలంగాణ బీజేపీ నేతలు ఫిరాయింపులపై కాంగ్రెస్ కే సపోర్ట్ గా మాట్లాడారు. కాంగ్రెస్ లో చేరికల వల్ల బీజేపీకి వచ్చిన లాభమేం లేదు కానీ, బీఆర్ఎస్ కు నేతలు దూరమవుతున్నారని మాత్రం ఆ పార్టీ సంబరపడుతోంది.