ఆ నాలుగు స్థానాలకు బీజేపీకి అభ్యర్థులు దొరికినట్టే!
ఆపరేషన్ ఆకర్ష్‌తో నలుగురు నేతలు చేరడంతో ఆ నలుగురినే దాదాపు ఆ నాలుగు నియోజకవర్గాల్లో ఎంపీలుగా పోటీ చేయించబోతోందని సమాచారం.
ఈరోజు ఢిల్లీలో బీజేపీ నేత తరుణ్‌ఛుగ్ సమక్షంలో పార్టీలో చేరిన నలుగురు బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీకి లోక్‌సభ అభ్యర్థుల బెంగ తీర్చారు. బీఆర్ఎస్ మొన్నటి ఎన్నికల వరకు చాలా బలంగా ఉన్న మహబూబాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఎక్కడి నుంచి తేవాలని బీజేపీ ఆలోచించింది. ఆపరేషన్ ఆకర్ష్‌తో నలుగురు నేతలు చేరడంతో ఆ నలుగురినే దాదాపు ఆ నాలుగు నియోజకవర్గాల్లో ఎంపీలుగా పోటీ చేయించబోతోందని సమాచారం.
మహబూబాబాద్‌కు సీతారాం నాయక్, ఆదిలాబాద్‌కు గొడెం నగేష్
సీతారాం నాయక్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మూడు రోజుల కిందట కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. గొడెం నగేష్ వస్తే ఆదిలాబాద్ టికెట్ ఇవ్వాలని బీజేపీ ముందు నుంచే ప్లాన్ చేస్తోంది. మహబూబాబాద్, ఆదిలాబాద్ ఈ రెండు ఎంపీ నియోజకవర్గాల్లో ఒకటి ఆదివాసీలకు ఇస్తే మరొకటి బంజారాలకు ఇవ్వాలన్న సమీకరణం ఉంది. అందుకే వీళ్లిద్దరూ చేరేవరకు ఆ నియోజవకర్గాలకు అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టారు. ఇప్పుడు చేరికతో ఆ రెండు నియోజకవర్గాలు వారికి కేటాయించేసినట్టే అంటున్నారు.
ఖమ్మంలో జలగం.. నల్గొండలో శానంపూడి
ఇక బీజేపీకి ఏమాత్రం పట్టులేని ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఎలాగైనా పాగా వేయాలని కమలనాథులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే మాజీ సీఎం జలగం వెంగళరావు తనయుడు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావును పార్టీలోకి తేవడానికి కిరణ్‌కుమార్ రెడ్డి ద్వారా రాయబారం నడిపారు. ఆయన చేరడంతో ఇక్కడ బీజేపీ ఎంపీ టికెటిస్తారని చెబుతున్నారు. మరోవైపు ఎన్నారైగా వచ్చి హుజూర్‌నగర్ ఎమ్మెల్యే అయిన శానంపూడి సైదిరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన్ను పార్టీలోకి తీసుకున్న బీజేపీ నల్గొండ ఎంపీగా పోటీకి రంగం సిద్ధం చేస్తోంది.