టార్గెట్ కేసీఆర్ మొదలైనట్లేనా?
తాజాగా మంత్రి గంగుల కమలాకర్ ఇల్లు, ఆఫీసులతో పాటు ఆయన దగ్గర బంధువుల ఇళ్ళపైన కూడా ఏకకాలంలో ఐటి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉన్నతాధికారులు సోదాలు జరిపారు.
కేసీఆర్ టార్గెట్‌గా కేంద్ర దర్యాప్తు సంస్ధలతో బీజేపీ ఆట మొదలైనట్లే ఉంది. నాన్ బీజేపీ ప్రభుత్వాల్లోని మంత్రులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలను టార్గెట్ చేసుకుని సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఐటీ సంస్ధలను బీజేపీ ప్రయోగిస్తోందని ఆరోపణలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, కర్నాటక, బీహార్, మహారాష్ట్రాల్లో ఇలాంటి టార్గెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ జాబితాలో తెలంగాణ కూడా చేరిందా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.
తాజాగా మంత్రి గంగుల కమలాకర్ ఇల్లు, ఆఫీసులతో పాటు ఆయన దగ్గర బంధువుల ఇళ్ళపైన కూడా ఏకకాలంలో ఐటి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉన్నతాధికారులు సోదాలు జరిపారు. గంగులకు గ్రానైట్ బిజినెస్‌లు ఉన్నాయి. ఆయనకు చెందిన మూడు కంపెనీలతో పాటు అత్యంత సన్నిహితులకు చెందిన కంపెనీలపైన కూడా దాడులు జరగటంతో కలలకం మొదలైంది. వ్యాపారాల్లో ఏవైనా తప్పులుంటే పట్టుకోవాల్సిందే, ముక్కుపిండి జరిమానాలు వసూళ్ళు చేయాల్సిందే.
అయితే ఏవో తప్పులు జరుగుతున్నాయన్న అనుమానాలతో పదే పదే ఆఫీసులు, ఇళ్ళపై దాడులు చేయటం మాత్రం తప్పే. కానీ ఇక్కడ దర్యాప్తు సంస్ధలు చేస్తున్నదిదే. కర్నాటకలో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ఇంటిపైన ఇప్పటికి ఓ పది సార్లయినా దాడులుచేసుంటారు. ప్రతిసారి విచారణకు రమ్మని నోటీసులిస్తున్నారు. ఎన్నిసార్లు దాడులుచేస్తారు? ఎన్నిసార్లు విచారణ చేస్తారు? అలాగే ఢిల్లీ ఆప్ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇల్లు, ఆఫీసులపై ఇప్పటికి నాలుగు సార్లు దాడులు చేసి నాలుగు సార్లు విచారణలు జరిపారు. ఇన్నిసార్లు సోదాలు చేసినా, విచారణలు చేసినా సీబీఐకి ఏమీ దొరకలేదు.
ఇదే పద్దతిలో ఇపుడు తెలంగాణా మంత్రిని దర్యాప్తు సంస్ధలు టార్గెట్ చేసుకున్నాయనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అదికూడా మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ ఓడిపోయిన మూడోరోజే దాడులు జరగటంతో అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఇదే విషయమై గతంలోనే కేసీఆర్ మంత్రులు, ప్రజాప్రతినిధులకు హెచ్చరించారు. ఏదేమైనా గంగులతో మొదలైన దాడులు ఎంత మంది దాకా వెళుతుందో చూడాలి. ఎందుకంటే మంత్రులు, ప్రజాప్రతినిధుల్లో చాలా మందికి ఏదో బిజినెస్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా.