Telugu Global
Telangana

టీడీపీతో పొత్తు.. బీజేపీ ఫస్ట్ రియాక్షన్

ఇటీవల కర్నాటక అసెంబ్లీ ఫలితాలు కూడా జాతీయ స్థాయిలో బీజేపీపై ఉన్న వ్యతిరేకతకు ప్రతిబింబంగా నిలిచాయి. ఈ దశలో తెలంగాణలో బీజేపీ ఒంటరిపోరు ఏ మేరకు లాభం అనే ప్రశ్నలు వినపడుతున్నాయి.

టీడీపీతో పొత్తు.. బీజేపీ ఫస్ట్ రియాక్షన్
X

టీడీపీతో పొత్తు.. బీజేపీ ఫస్ట్ రియాక్షన్

చంద్రబాబు, అమిత్ షా భేటీ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. 2014 ఎన్నికల్లో కలసి పోటీ చేసిన ఆ రెండు పార్టీలు అనంతర కాలంలో వేరుపడ్డాయి, అప్పటినుంచి అడపా దడపా మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ దశలో ఇప్పుడు ఇద్దరు నేతలు భేటీ కావడంతో మళ్లీ పొత్తు పొడుపులపై చర్చ మొదలైంది. అయితే అవన్నీ వట్టి ఊహాగానాలే అని కొట్టిపారేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఊహాజనిత కథనాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అమిత్ షాని, జేపీ నడ్డాని.. చంద్రబాబు కలిస్తే తప్పేంటన్నారు బండి. మమతా బెనర్జీ, స్టాలిన్, నితీష్ కుమార్ కూడా మోదీ, అమిత్ షా ని పలు సందర్భాల్లో కలిశారని, అయినా ఆ పార్టీలతో తమకు పొత్తు లేదని స్పష్టం చేశారు. అయితే అక్కడ ముఖ్యమంత్రులు అధికారికంగా ప్రధానిని, హోం మంత్రిని కలవడం వేరు. 2018 తర్వాత కనీసం మాటలకు కూడా అవకాశం లేని అమిత్ షా, చంద్రబాబు కలవడం వేరు అంటున్నారు కొంతమంది. కచ్చితంగా అది కూటమికోసం జరిగిన సన్నాహక సమావేశమేనని తేల్చేస్తున్నారు.

తెలంగాణలో పొత్తు అవసరమే..

ఆమధ్య జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు రావడంతో బీజేపీలో ఆత్మవిశ్వాసం కాస్త పెరిగింది. కానీ మునుగోడు ఫలితం మళ్లీ ఆలోచనలో పడేసింది. ఇటీవల కర్నాటక అసెంబ్లీ ఫలితాలు కూడా జాతీయ స్థాయిలో బీజేపీపై ఉన్న వ్యతిరేకతకు ప్రతిబింబంగా నిలిచాయి. ఈ దశలో తెలంగాణలో బీజేపీ ఒంటరిపోరు ఏమేరకు లాభం అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. జనసేన, టీడీపీతో అధికారికంగా పొత్తు పెట్టుకుంటే ఓట్ల సంఖ్య పెరిగే అవకాశముందనే అంచనాలున్నాయి. అందుకే చంద్రబాబుని, బీజేపీ పెద్దలు ఢిల్లీకి పిలిపించారనే టాక్ వినపడుతోంది.

ఏపీలో అత్యవసరం..

తెలంగాణలో టీడీపీ కంటే బీజేపీ బలంగా ఉందనుకోవచ్చు కానీ ఏపీలో మాత్రం బీజేపీ రోడ్డెక్కిన మొసలి అనుకోవాల్సిందే. జనసేన, టీడీపీ వంటి పార్టీలతో చేరితేనే కాస్తో కూస్తో స్థానబలం వస్తుంది కానీ సొంతగా బీజేపీకి మాత్రం బలం లేదు. పదే పదే ఆ విషయం రుజువవుతోంది. ఈ దశలో పొత్తుల ఎత్తులకోసమే చంద్రబాబు ఢిల్లీలో మకాం వేశారు. రెండు పార్టీలనుంచి ఈ విషయంపై ఇప్పటి వరకూ ఎవరూ స్పందించలేదు. కానీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం అవన్నీ ఊహాగానాలే అని చెప్పడం విశేషం.

First Published:  4 Jun 2023 4:41 PM IST
Next Story