Telugu Global
Telangana

బీజేపీవి పగటి కలలే.. కేసీఆర్ టార్గెట్ అదే!

సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. ఆయన ఒక్క సారిగా చక్రం తిప్పడంతో కీలక నాయకులు తిరిగి టీఆర్ఎస్‌లోకి వచ్చేశారు.

బీజేపీవి పగటి కలలే.. కేసీఆర్ టార్గెట్ అదే!
X

తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుందో ఆ పార్టీ నాయకులకు కూడా అర్థం కావడం లేదు. బూర నర్సయ్య గౌడ్‌ను పార్టీలోకి తీసుకొని వచ్చి టీఆర్ఎస్‌ను దెబ్బ తీశామని ఆనందంలో ఉండగానే.. బీజేపీ నుంచి దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ వెళ్లిపోవడం వారిని కలవర పెట్టింది. మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ దాదాపు రెండు వారాలు హైదరాబాద్‌లో లేరు. ఆయన ఢిల్లీలోనే మకాం వేయడంతో బీజేపీ ఇక్కడ ఆడింది ఆటగా సాగింది. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నా.. బీజేపీ మాత్రం చేరికలు ఉంటాయంటూ పార్టీ నేతలను రెచ్చగొట్టింది. నర్సయ్య గౌడ్‌ను చేర్చుకున్న తర్వాత మాటల దాడిని మరింత పెంచింది.

సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. ఆయన ఒక్క సారిగా చక్రం తిప్పడంతో కీలక నాయకులు తిరిగి టీఆర్ఎస్‌లోకి వచ్చేశారు. రేపో మాపో మరి కొందరు సీనియర్ నాయకులు కూడా టీఆర్ఎస్ బాట పట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. దీన్ని కవర్ చేసుకోవడానికి ఎమ్మెల్యే రఘునందర్ రావు.. టీఆర్ఎస్ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తున్నారంటూ ప్రచారం ప్రారంభించారు. కానీ బీజేపీవి అన్నీ పగటి కలలే అని తెలిసిపోతోంది. టీఆర్ఎస్ నుంచి నాయకులను గుంజేద్దామని భావించిన బీజేపీ పాచికలు పారకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే చర్చ జరుగుతున్నది.

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కేసీఆర్‌ను మించిన చాణక్యుడు లేడని అందరికీ తెలుసు. రాబోయే ఉపద్రవాన్ని ఆయన ముందుగానే పసిగట్టి వ్యూహాలు సిద్ధం చేస్తుంటారు. తన పార్టీలోని ఎమ్మెల్యేలను పోగొట్టుకోవడానికి కేసీఆర్ ఏ మాత్రం ఇష్టపడరు. అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లాలనే ఆలోచన చేయరు. మరో 14 నెలల అధికారం ఉండగా.. టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లడానికి ఏ ఎమ్మెల్యే సిద్ధం అవుతారు? ఒక వేళ వెళ్లినా వారిపై అనర్హత వేటు పడుతుందనే సంగతి ముందుగానే తెలుసు. బీజేపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నట్లు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు జంప్ అవడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

కీలకమైన మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో నాయకులు పార్టీని వీడటం బీజేపీలో ముసలం పుట్టించింది. ప్రచారం సంగతి పక్కన పెట్టి ఉన్న నాయకులను కాపాడుకునే పనిలో పడ్డారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా పార్టీ జంప్ అయ్యే అవకాశాలు ఉన్న నాయకులతో మంతనాలు సాగిస్తున్నారు. సీఎం కేసీఆర్ టార్గెట్ కూడా అదే. పోలింగ్ నాటికి బీజేపీలో భయం పుట్టించి వారిని మానసికంగా బలహీనం చేయడమే ఆయన లక్ష్యం. ఇన్నాళ్లూ బీజేపీ ఆడిన డ్రామానే.. ఇప్పుడు కేసీఆర్ రివర్స్‌లో ప్రయోగించారనే చర్చ జరుగుతోంది. అనవసరంగా బీజేపీ నాయకులు బూరను చేర్చుకున్న తర్వాత టీఆర్ఎస్ పని ఖతం అనేలా మాటలు మాట్లాడారని, అవి మనసులో పెట్టుకున్న కేసీఆర్.. దాసోజు, భిక్షమయ్య గౌడ్, స్వామి గౌడ్‌లను చేర్చుకోవడం ద్వారా కౌంటర్ ఇచ్చారని అంటున్నారు.

First Published:  23 Oct 2022 8:48 AM IST
Next Story