Telugu Global
Telangana

పక్క రాష్ట్రాల ఎమ్మెల్యేలతో పక్కా వ్యూహం..!!

తెలంగాణకు వచ్చే బీజేపీ ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన నియోజక వర్గంలో వారం రోజుల పాటు పర్యటించి, స్థానిక నాయకులను కలుస్తారు. బూత్ స్థాయిలో పార్టీ పరిస్థితి, స్థానిక అంశాలపై రిపోర్టులు తీసుకుంటారు.

పక్క రాష్ట్రాల ఎమ్మెల్యేలతో పక్కా వ్యూహం..!!
X

తెలంగాణలో అధికారంలోకి రావాలనేది బీజేపీ వ్యూహం. అయితే ప్రచారం ఎలా చేపట్టాలనేదగ్గర కమలనాథులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పక్క రాష్ట్రాల నేతలతోనే జనాలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కూడా పక్క రాష్ట్రాల నేతలే తెలంగాణ బీజేపీకి దిక్కవుతున్నారని స్పష్టమైంది. తెలంగాణలో ఎన్నికల ప్రచారం కోసం పక్క రాష్ట్రాలనుంచి 119 మంది ఎమ్మెల్యేలను తెలంగాణకు పిలిపిస్తోంది అధిష్టానం. ఒక్కో నియోజకవర్గ ప్రచార బాధ్యత ఒక్కో ఎమ్మెల్యేకి అప్పగిస్తోంది.

ఈ నెల 20నుంచి

తెలంగాణలో ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేల పర్యటనలకు షెడ్యూల్ కూడా ఖరారు కాబోతోంది. ఈనెల 20నుంచి పర్యటనలు మొదలు పెడతారని బీజేపీ నేతలంటున్నారు. రాష్ట్రంలో 119 నియోజక వర్గాలకు 119 మంది బీజేపీ ఎమ్మెల్యేలు వస్తారు, వారం రోజులు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో మకాం వేస్తారు. వారం రోజులపాటు నియోజకవర్గం మొత్తం కలియదిరుగుతారు. కర్నాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు వారం రోజుల పాటు తెలంగాణలో పర్యటిస్తారని ఆ పార్టీ వర్గాలంటున్నాయి. ఆ తర్వాత ఇతర కీలక నేతల సభలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

తెలంగాణకు వచ్చే ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన నియోజక వర్గంలో వారం రోజుల పాటు పర్యటించి, స్థానిక నాయకులను కలుస్తారు. బూత్ స్థాయిలో పార్టీ పరిస్థితి, స్థానిక అంశాలపై రిపోర్టులు తీసుకుంటారు. వాటిని బీజేపీ అధిష్టానానికి సమర్పిస్తారని తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేల రాకతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగే అవకాశముంది. ప్రధాని, కేంద్ర మంత్రులు, ఇతర కీలక నేతలతోపాటు.. 119మంది ఎమ్మెల్యేలను తెలంగాణలో మోహరించబోతోంది బీజేపీ. ఈ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

First Published:  2 Aug 2023 9:48 PM IST
Next Story