Telugu Global
Telangana

రాష్ట్రంలో బీజేపీకి బూత్ కార్యకర్తలు కూడా లేరు.. కంగారుపడుతున్న అధిష్టానం!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించిన తర్వాత ఆయన రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఒక నివేదిక తెప్పించుకున్నట్లు తెలిసింది. దాంట్లో 34వేల బూత్‌లకు గాను కేవలం 15వేల లోపే బూత్ కమిటీలు ఉన్నట్లు స్పష్టమైంది.

రాష్ట్రంలో బీజేపీకి బూత్ కార్యకర్తలు కూడా లేరు.. కంగారుపడుతున్న అధిష్టానం!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో బీజేపీలో కంగారు ఎక్కువైంది. ఇన్నాళ్లూ 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో బరిలోకి దిగడానికి సరైన అభ్యర్థులే లేరని ఆందోళన చెందిన బీజేపీకి.. ఇప్పుడు మరో తలనొప్పి మొదలైంది. ఇటీవల రాష్ట్ర పార్టీకి సంబంధించిన వివరాలు తెప్పించుకున్న అధిష్టానానికి.. రాష్ట్రం వ్యాప్తంగా చాలా చోట్ల బీజేపీకి బూత్ స్థాయి కార్యకర్తలు కూడా లేరని అర్థమైంది. ఎన్నికల సమయంలో బూత్ కార్యకర్తలే కీలకంగా ఉంటారు. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా.. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని పదే పదే సూచించినా.. ఆయన పెడచెవిన పెట్టారు. ఈ విషయంలో చాలా సార్లు అధిష్టానం బండి సంజయ్‌కు క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించిన తర్వాత ఆయన రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఒక నివేదిక తెప్పించుకున్నట్లు తెలిసింది. దాంట్లో 34వేల బూత్‌లకు గాను కేవలం 15వేల లోపే బూత్ కమిటీలు ఉన్నట్లు స్పష్టమైంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి బూత్ కమిటీలే కారణం. ఇదే ఫార్ములాతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ అంచనా వేసింది. కానీ ఇప్పటికీ బూత్ స్థాయిలో ఎలాంటి కమిటీలు లేకపోవడం అధిష్టానాన్ని కూడా కంగారు పెడుతోంది.

హైదరాబాద్‌లో బీజేపీ చాలా బలంగా ఉందని నాయకులు ప్రచారం చేసుకుంటుంటారు. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క కుత్బుల్లాపూర్ మినహాయిస్తే.. ఏ నియోజకవర్గంలో కూడా బీజేపీకి బూత్ కమిటీలు లేకపోవడం గమనార్హం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఇక్కడ బూత్ కమిటీలు బలంగా ఉన్నాయని అంచనా వేసుకున్నారు. కానీ చాలా చోట్ల అభ్యర్థుల బలం, వారి సొంత పరిచయాలే గెలిపించాయని.. బీజేపీతో ఆ విజయానికి ఎలాంటి సంబంధం లేదని పార్టీలో చర్చ జరుగుతున్నది. హైదరాబాద్‌లో పర్వాలేదని భావించిన బీజేపీకి.. ఇప్పుడు అసలు బూత్ స్థాయి కమిటీలే లేవని తెలియడంతో కంగారు పడుతోంది.

బీజేపీ దగ్గర ఉన్న బూత్ కమిటీ వివరాలతో ఇటీవల కొంత మంది కార్యకర్తలకు కాల్ చేయగా.. అసలు తాము పార్టీలోనే లేమనే సమాధానం వచ్చిందట. దీంతో రాష్ట్ర నాయకత్వం కంగారుపడింది. విషయాన్ని వెంటనే అధిష్టానానికి చేరవేసింది. మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కనీసం బూత్ కమిటీలను కూడా పటిష్టం చేయలేదనే రిపోర్టును పార్టీ అధినాయకత్వానికి పంపినట్లు తెలుస్తున్నది.

తెలంగాణ నుంచి వచ్చిన రిపోర్టు చూసి అప్రమత్తమైన జాతీయ నాయకత్వం ఈ విషయంలో వెంటనే తగిన చర్య తీసుకోవాలని సునిల్ బన్సల్‌కు చెప్పినట్లు సమాచారం. ఆయన త్వరలోనే బూత్ కమిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తున్నది. జీహెచ్ఎంసీ సహా కీలక నియోజకవర్గాల్లో వెంటనే బూత్ కమిటీలను ఏర్పాటు చేసి.. ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ భావిస్తోంది.

First Published:  12 Aug 2023 8:35 AM IST
Next Story