కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి వేయించు.. రాజగోపాల్ రెడ్డికి బీజేపీ ఆదేశం?
మునుగోడు ఓటర్లను ఇప్పుడు అర్జెంటుగా బీజేపీ వైపు చూసేలా చేయాల్సి ఉంది. అయితే అత్యధికంగా గ్రామీణ ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులకు కాకుండా వేరే పార్టీకి ఓట్లు వేస్తారా అనే భయం బీజేపీలో ఉంది.
మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ గెలవాలంటే కాంగ్రెస్ అభిమానులే ఓటేయాలి. వినడానికి వింతగా ఉన్నా.. క్షేత్ర స్థాయి పరిస్థితి మాత్రం అదే. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉపఎన్నికలో బీజేపీ తరపున బరిలోకి దిగనున్నారు. అదే సమయంలో అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కూడా తమ అభ్యర్థులను నిలబెట్టనుంది. దీంతో గతంలో కాంగ్రెస్‌కు ఓటేసిన ఓటర్లు ఇప్పుడు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. మునుగోడులో ప్రచారానికి కేంద్ర మంత్రి అమిత్ షా సహా.. కీలక నేతలు వచ్చినా.. చివరకు ఓట్లేయించుకోవల్సిన బాధ్యత రాజగోపాల్‌దే అని బీజేపీ తేల్చి చెప్పింది.
మునుగోడు నియోజకవర్గం ఓటర్లు మొదటి నుంచి కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులనే గెలిపించుకుంటూ వచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచినా.. ఆ తర్వాత ఎన్నికల్లో మళ్లీ అది కాంగ్రెస్ ఖాతాలో చేరింది. మునుగోడు ఓటర్లను ఇప్పుడు అర్జెంటుగా బీజేపీ వైపు చూసేలా చేయాల్సి ఉంది. అయితే అత్యధికంగా గ్రామీణ ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులకు కాకుండా వేరే పార్టీకి ఓట్లు వేస్తారా అనే భయం బీజేపీలో ఉంది. 2014 ఎన్నికల్లో బీజేపీ తరపున నిలబడిన గంగిడి మనోహర్ రెడ్డికి 27,434 ఓట్లు లభించాయి. అయితే 2018కి వచ్చే సరికి ఆయనకు లభించిన ఓట్లు కేవలం 12,725. బీజేపీ అభ్యర్థి ఆ ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు.
2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 97,239 ఓట్లు లభించాయి. బీజేపీ ఓటర్లతో పాటు గతంలో తాను కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నప్పుడు వచ్చిన ఓటింగ్‌ను కూడా బీజేపీకి పడేటట్లు చేసుకోగలిగితేనే రాజగోపాల్ రెడ్డికి విజయం దక్కుతుంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 74,687 ఓట్లు దక్కించుకున్నారు. ఈ ఓట్లను కాపాడుకుంటూ.. గతంలో రాజగోపాల్ రెడ్డికి పడిన ఓట్లను కనుక చీల్చగలిగితే టీఆర్ఎస్‌దే విజయం అవుతుంది. అలా కాకుండా సాంప్రదాయంగా ఎప్పటి నుంచో కాంగ్రెస్‌కు ఉన్న ఓటు బ్యాంకు మొత్తం కాంగ్రెస్‌కే పడితే మాత్రం మిగిలిన పార్టీలకు తిప్పలు తప్పవు.
మునుగోడు రాజకీయ చరిత్ర బీజేపీ నేతలకు తెలుసు కాబట్టే.. అక్కడ గెలుపుపై పూర్తి బాధ్యతను రాజగోపాల్ రెడ్డిపై పెట్టింది. కాంగ్రెస్ ఓటర్లను బీజేపీ వైపు చూసేలా చేయాలని స్పష్టం చేసింది. రాజగోపాల్ రెడ్డి క్యాడర్‌కు బీజేపీలో సరైన స్థానం లభించేలా చేస్తామని కూడా హామీ ఇచ్చింది. మరోవైపు బీజేపీ తరపున ప్రతీ 100 మంది ఓటర్లకు ఒక బాధ్యుడు ఉండేలా వ్యవస్థను సిద్దం చేస్తోంది. వీరందరినీ రాజగోపాల్ రెడ్డే సమన్వయం చేయాలని చెప్పింది. ఇక బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అత్తగారిల్లు కూడా మునుగోడు నియోజకవర్గంలో ఉంది. ఆయన కూడా ఆ వైపు నుంచి బీజేపీకి ఓట్లు పడేలా వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక గతంలో ఇక్కడి నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన గంగిడి మనోహర్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ ఇంచార్జిగా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి రావడంతో ఆయన సీటు గల్లంతైనట్లే అని చెప్పుకోవచ్చు. మరి ఈ సమయంలో మనోహర్ రెడ్డి ఏం చేయబోతున్నారనేది కూడా ఆసక్తికరమే. ప్రస్తుతం బండి సంజయ్ పాదయాత్ర బాధ్యతలు చూస్తున్న మనోహర్ రెడ్డికి త్వరలో పార్టీలో కీలక పదవి వస్తుందని.. ఆ విధంగా అసంతృప్తి చల్లారుస్తారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా మునుగోడులో బీజేపీ గెలవాలంటే మాత్రం రాజగోపాల్ రెడ్డి ఏ మేరకు కాంగ్రెస్ ఓటర్లను అటువైపు తిప్పుతారనే దానిపైనే ఆధారపడి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.