Telugu Global
Telangana

మునుగోడులో నడ్డా సమాధి.. వైరల్ అవుతున్న వీడియో

2016లో ఇచ్చిన హామీలకే దిక్కులేదు, ఇప్పుడు మళ్లీ ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడగడానికి బీజేపీ నేతలు వస్తున్నారంటూ మండిపడుతున్నారు స్థానికులు. ఫ్లోరైడ్ బాధితులెవరైనా నడ్డాకి ఇలా సమాధి ఏర్పాటు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

మునుగోడులో నడ్డా సమాధి.. వైరల్ అవుతున్న వీడియో
X

మునుగోడులో ఎన్నికల తేదీ దగ్గరపడే కొద్దీ ప్రచార వేడి పెరిగిపోతోంది. పోటా పోటీ ప్రచారాలతోపాటు, విమర్శలు, వెటకారాల ఘాటు కూడా బాగా పెరిగింది. తాజాగా మునుగోడు పరిధిలోని చౌటుప్పల్ దగ్గర దండుమల్కాపురంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమాధి కట్టారు. సమాధికోసం గుంత తవ్వి, అందులో ఏదో పూడ్చేసినట్టు చేశారు. ఆ పక్కనే నడ్డా ఫ్లెక్సీ పెట్టారు. ఈ వీడియో, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నడ్డా సమాధి వ్యవహారంతో బీజేపీ ఆగ్రహంతో ఊగిపోతోంది.

2016 ముచ్చట..

2016 ముచ్చట అది. అప్పట్లో జేపీ నడ్డా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి. మునుగోడు పరిధిలోని మర్రిగూడలో ఆయన పర్యటనకు వచ్చారు. చౌటుప్పల్ లో ఫ్లోరైడ్ మిటిగేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు కదా అని రాష్ట్ర ప్రభుత్వం నిజమేననుకుంది. 8.2 ఎకరాల స్థలం కూడా కేటాయించింది. కానీ కేంద్రం పైసా విదల్చలేదు. దీంతో ఆ స్థలం వృథాగా ఉంది. తాజాగా మునుగోడు ఉప ఎన్నికలతో మళ్లీ ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. 2016లో ఇచ్చిన హామీలకే దిక్కులేదు, ఇప్పుడు మళ్లీ ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడగడానికి బీజేపీ నేతలు వస్తున్నారంటూ మండిపడుతున్నారు స్థానికులు. ఫ్లోరైడ్ బాధితులెవరైనా నడ్డాకి ఇలా సమాధి ఏర్పాటు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

నడ్డా హామీలన్నీ నీటి మూటలే..

రీసెర్చ్ సెంటర్ తో పాటు, మర్రిగూడలో 300 పడకల ఆస్పత్రి ఏర్పాటుకి కూడా నడ్డా అప్పట్లో హామీ ఇచ్చారు. ఫ్లోరైడ్ బాధితులకు ఆర్థికసాయం కూడా చేస్తామన్నారు. ఆ తర్వాత మిషన్ భగీరథతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి మంచినీరు సరఫరా చేయడంతో మునుగోడుకి ఫ్లోరైడ్ కష్టాలు తీరాయి. కానీ అప్పటి కేంద్ర ప్రభుత్వ హామీ మాత్రం ఇంకా స్థానికుల్ని వెక్కిరిస్తూనే ఉంది. సాయం చేయకపోయినా పర్లేదు, బూటకపు మాటలతో మోసం చేసిన బీజేపీ, ఇప్పుడు మళ్లీ ఓట్లు అడగడానికి వస్తుండే సరికి స్థానికులకు ఆ ద్రోహం గుర్తొచ్చింది. పైగా ఇప్పుడు 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కోసం ఉప ఎన్నికలు తేవడం మరింత బాధాకరం. అందుకే ఇలాంటి సమాధి సెటైర్లు బయటకొస్తున్నాయి.

First Published:  20 Oct 2022 12:17 PM IST
Next Story