Telugu Global
Telangana

కవితకు సంఘీభావం.. బీజేపీకి స్ట్రాంగ్ వార్నింగ్..

బీజేపీ నేతలు కవిత ఇంటి వ‌ద్ద ఆందోళ‌న చేప‌ట్ట‌డం దుర్మార్గం అని, హేయమైన చర్య అని అన్నారు టీఆర్ఎస్ నేతలు. తామంతా అప్పుడు అక్కడే ఉన్నామని, బీజేపీ నేతలు కావాలనే ఓ పథకం ప్రకారం అలజడి సృష్టించేందుకు అక్కడికి వచ్చారని చెప్పారు.

కవితకు సంఘీభావం.. బీజేపీకి స్ట్రాంగ్ వార్నింగ్..
X

నిరాధారమైన ఆరోపణలు అని తెలిసినా కూడా కేవలం రాజకీయ దురుద్దేశంతో ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద బీజేపీ నేతలు హంగామా సృష్టించారని మండిపడ్డారు టీఆర్ఎస్ నేతలు. హైదరాబాద్ లోని కవిత ఇంటి వద్ద సోమవారం బీజేపీ నేతల ఆందోళన, అరెస్ట్ వ్యవహారం తెలిసిందే. వజ్రోత్సవాల ముగింపు వేళ, బీజేపీ నేతలు ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు టీఆర్ఎస్ నేతలు. కవితకు సంఘీభావం తెలిపేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ ఆమె ఇంటికి వెళ్లారు. కవితను పరామర్శించి, సంఘీభావం తెలిపారు.

టీఆర్ఎస్ సైన్యం ఎంతుందో తెలుసా..?

బీజేపీ నేతలు కవిత ఇంటి వ‌ద్ద ఆందోళ‌న చేప‌ట్ట‌డం దుర్మార్గం అని, హేయమైన చర్య అని అన్నారు టీఆర్ఎస్ నేతలు. తామంతా అప్పుడు అక్కడే ఉన్నామని, బీజేపీ నేతలు కావాలనే ఓ పథకం ప్రకారం అలజడి సృష్టించేందుకు అక్కడికి వచ్చారని చెప్పారు. మీ ఇళ్లపైకి రావాలంటే మాకు పెద్ద విషయమేం కాదని వార్నింగ్ ఇచ్చారు. మా టీఆర్ఎస్ సైన్యం ఎంతో మీకు తెలుసా అని ప్రశ్నించారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే తీవ్రమైన పరిణామాలుంటాయని బీజేపీ నేతల్ని హెచ్చరించారు మంత్రి తలసాని.

తప్పుడు ఆరోపణలు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో కేసీఆర్ కుమార్తెకు సంబంధం ఉందంటూ బీజేపీ నేతలు ఆరోపణలు మొదలు పెట్టారు. ఢిల్లీలో వినిపించిన ఈ ఆరోపణలపై ఇక్కడ తెలంగాణ నేతలు తీవ్రంగా స్పందించారు. కవిత దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఆమె ఇంటిని చుట్టుముట్టారు. అప్పటికే కవిత తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. పరువు నష్టం దావా వేస్తానన్నారు. కానీ బీజేపీ నేతలు ఓ పథకం ప్రకారం ఆమె ఇంటిని చుట్టుముట్టారని, కేసీఆర్ ని ఎదుర్కొనే సత్తా లేక, ఆమె కుమార్తెపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ టీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. కవిత ఇంటి ముట్టడిని గులాబీదళం తీవ్రంగా ఖండించింది. ఇప్పటికిప్పుడు తాము బీజేపీ ఆఫీస్ లను ముట్టడించగలమని, కానీ తమకు సంస్కారం ఉందని, అందుకే ఆ పని చేయడంలేదని అన్నారు టీఆర్ఎస్ నేతలు.

First Published:  23 Aug 2022 12:19 PM IST
Next Story