60లో 20.. బీజేపీ యాక్షన్ ప్లాన్
ప్రధాని మోదీ తెలంగాణలో మరో మూడు బహిరంగ సభలకు రావాల్సి ఉంది. ఈ సభలు జరిగే లోగా.. ఇదివరకే ఇచ్చిన వరాలపై భారీగా ప్రచారం చేపట్టాలని అధిష్టానం ఆదేశించింది.
తెలంగాణ ఎన్నికలకోసం బీజేపీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. 60లో 20 అంటూ కొత్త కార్యక్రమాలతో ముందుకొస్తోంది. 60రోజుల్లో 20 రకాల కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. స్టేట్ కౌన్సిల్ మీటింగ్ ఈమేరకు తీర్మానం చేసింది. ఇకపై బీజేపీ నేతలు నిత్యం ప్రజల్లో ఉండేలా సభలు, సమావేశాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది.
60 రోజుల్లో 20 రకాల కార్యక్రమాల్లో భాగంగా మొత్తం 43 బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్ చేసింది. ప్రధాని మోదీ తెలంగాణలో మరో మూడు బహిరంగ సభలకు రావాల్సి ఉంది. ఈ సభలు జరిగే లోగా.. ఇదివరకే ఇచ్చిన వరాలపై భారీగా ప్రచారం చేపట్టాలని అధిష్టానం ఆదేశించింది. పసుపు బోర్డ్, ట్రైబల్ వర్సిటీ, కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటుపై రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి విజయోత్సవాలు మొదలు పెట్టబోతోంది బీజేపీ.
ఈ నెల 9, 10, 11 తేదీల్లో ‘మేరీ మాటి మేరా దేశ్’ కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో మట్టి సేకరణ చేపట్టబోతోంది బీజేపీ. ఈ నెల 10 నుంచి 31 వరకు 38 జిల్లాలో బహిరంగ సభలకు కార్యాచరణ సిద్ధం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 3 లక్షల మందిని గుర్తించి ప్రధాని విశ్వకర్మ యోజన కింద రూ.3 లక్షల లోన్ ఇప్పించాలని నాయకులకు ఆదేశాలిచ్చింది అధిష్టానం. ఈనెల 15వతేదీన బీజేపీ మేనిఫెస్టోపై ప్రజాభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించారు. ఈ నెల13 నుంచి 20 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు, సోషల్ మీడియా టీంలతో మీటింగ్ లు ఉంటాయి. ఈ నెల 26 నుంచి బీజేపీలోని అన్ని మోర్చాల నాయకులు ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని స్టేట్ కౌన్సిల్ మీటింగ్ నిర్ణయించింది. ఈ కార్యక్రమాలన్నీ 60రోజుల్లో పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే అభ్యర్థులను ఇంకా ఖరారు చేయకపోవడం బీజేపీకి పెద్ద మైనస్. బీజేపీ తరపున పోటీ చేసేందుకు చాలా చోట్ల అభ్యర్థులు కరువవ్వడంతో అసంతృప్తులకోసం ఆ పార్టీ వేచి చూస్తోంది. కాంగ్రెస్ కూడా అభ్యర్థులను ప్రకటిస్తే, ఆ తర్వాత బీజేపీ తొలి జాబితా విడుదలయ్యే అవకాశముంది.