బిత్తిరి సత్తి పొలిటికల్ ఎంట్రీ.. ఆ సీటుపై ఫోకస్!
జడ్చర్ల నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండడం..ఇందులో సొంత సామాజిక వర్గం ముదిరాజ్ ఓట్లు పెద్ద సంఖ్యలో ఉండడంతో ఇక్కడి నుంచి పోటీ చేయాలని సత్తి ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.
బిత్తిరి సత్తి అలియాస్ రవి కుమార్.. తెలంగాణలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అయితే ఇన్నాళ్లు టీవీ షోలకే పరిమితమైన సత్తి.. ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సత్తి.. జడ్చర్ల స్థానం నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండడం..ఇందులో సత్తి సొంత సామాజిక వర్గం ముదిరాజ్ ఓట్లు పెద్ద సంఖ్యలో ఉండడంతో ఇక్కడి నుంచి పోటీ చేయాలని సత్తి ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.
ఇటీవల సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ముదిరాజ్ ఆత్మగౌరవ సభలో సత్తి పాల్గొన్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ ముదిరాజ్ సామాజికవర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న సామాజిక వర్గానికి ఒక్క సీటు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. నామినేటెడ్ పదవులు చప్పగా ఉంటాయని, పోటీపడే సీట్లు కావాలంటూ డిమాండ్ చేశారు. దీంతో బిత్తిరి సత్తి వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
మరోవైపు జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు సత్తిని జడ్చర్ల నుంచి పోటీ చేయాలని కోరినట్లు తెలుస్తోంది. సొంత సామాజికవర్గం వారే ఆహ్వానిస్తుండడంతో పొలిటికల్ ఎంట్రీపై సత్తి ఆలోచనలో పడ్డారని సమాచారం. అయితే ముదిరాజ్ సభలో ఈటలపై సత్తి ప్రశంసలు కురిపించడంతో బీజేపీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జోరందుకుంది. కాగా, జడ్చర్ల నుంచి పోటీపై సత్తిని సంప్రదించగా పలువురు నేతలు ఆహ్వానించిన మాట నిజమేనని, దానిపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు.
♦