బిర్యానీ 140, భోజనం 80 రూపాయలు.. రేట్లు ఫిక్స్ చేసిన ఈసీ
ఎన్నికల ప్రచారానికి వాడే వాహనాలు, పరికరాలకు కూడా లెక్క ఇచ్చేశారు. డీసీఎం వాహనానికి రోజుకు 3 వేలు, మినీ బస్సుకు 3,500, ఇన్నోవాకు 4వేలు, పెద్ద బస్సుకు 6వేలుగా రెంట్ ఫిక్స్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చు తక్కువ చేసి చూపించకుండా ఎలక్షన్ కమిషన్ ఈసారి పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటి వరకు అభ్యర్థులు కార్యకర్తల భోజన ఖర్చుల నుంచి ప్రచార సామగ్రి వరకు ప్రతి దాని ధర తక్కువ చేసి చూపించేవారు. దీనికి చెక్ పెట్టడానికి ఈసీ సన్నద్ధమైంది. తెలంగాణ ఎన్నికల్లో దేనికి ఎంత రేటో ఫిక్స్ చేసి లిస్ట్ కూడా ఇచ్చేసింది.
సమోసా 10.. సాదా భోజనం 80
ఎన్నికల కమిషన్ రూపొందించిన లిస్ట్ ప్రకారం సమోసా 10 రూపాయలు, వాటర్ బాటిల్ 20, టిఫిన్ 35, సాదా వెజిటబుల్ భోజనం 80, చికెన్ బిర్యానీ 140, మటన్ బిర్యానీ 180 ఇలా ధరలు నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే కాస్త తక్కువ రేట్లు ఫిక్స్ చేశారు. ఈ మేరకే అభ్యర్థులు బిల్లులు చూపించాల్సి ఉంటుంది.
డ్రోన్ కెమెరాలకు, డీసీఎంలకూ కూడా లెక్కే
అదే విధంగా ఎన్నికల ప్రచారానికి వాడే వాహనాలు, పరికరాలకు కూడా లెక్క ఇచ్చేశారు. డీసీఎం వాహనానికి రోజుకు 3 వేలు, మినీ బస్సుకు 3,500, ఇన్నోవాకు 4వేలు, పెద్ద బస్సుకు 6వేలుగా రెంట్ ఫిక్స్ చేశారు. అలాగే డ్రోన్ కెమెరాకు రోజుకు రూ.5వేలు, ప్రచారానికి వాడే ఎల్ఈడీ స్క్రీన్‌కు రోజుకు 10,000, ఫంక్షన్ హాల్‌కు మినిమం 15వేల రూపాయల రెంట్‌గా ఈసీ నిర్ధారించింది. ఈమేరకే అభ్యర్థులు తమ ఖర్చు నమోదు చేయాలని స్పష్టం చేసింది.