ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 'ఫేక్ అటెండెన్స్'కు చెక్
విద్యార్థులందరికీ బయోమెట్రిక్ అటెండెన్స్‌ను తప్పనిసరి చేయనున్నది. బయోమెట్రిక్ అటెండెన్స్‌ను తీసుకొని ప్రతీ 15 రోజులకు ఒకసారి యూనివర్సిటీ సర్వర్లలోకి కాలేజీ యాజమాన్యం అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది.
కాలేజీకి రాగానే విద్యార్థులందరూ రెక్కలు వచ్చిన పక్షుల్లాగా ఫీలవుతారు. ఇంటర్‌లో జైల్లో ఉన్నట్లు ఫీలయ్యే వాళ్లు.. ఇంజనీరింగ్, మెడికల్, డిగ్రీ వంటి కోర్సుల్లో చేరగానే ఫ్రీడమ్ వచ్చినట్లు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు చాలా తక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్ సహాయంతోనో, అధ్యాపకులను మంచి చేసుకొనో అటెండెన్స్‌ను మేనేజ్ చేస్తుంటారు. ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లలు కాలేజీకి ప్రతీ రోజు వెళ్తున్నారనే అనుకుంటారు. కానీ తీరా ఎగ్జామ్స్ ముందు సరిపడా అటెండెన్స్ లేక పరీక్షలకు కూడా అర్హత సాధించరు. అటు పేరెంట్స్‌ని, ఇటు కాలేజీని మోసం చేస్తూ విద్యార్థులు తమ బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. అందుకే ఇలాంటి వారికి జేఎన్‌టీయూహెచ్ చెక్ పెట్టేందుకు రంగం సిద్దం చేసింది.
ఇకపై అన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో బీ.టెక్ స్టూడెంట్స్‌కు బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ (బీఏఎస్) తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది నవంబర్‌లో ఎంసెట్ చివరి కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత.. లాస్ట్ బ్యాచ్ కాలేజీలో జాయిన్ అవుతారు. అప్పటి నుంచి విద్యార్థులంరికీ బయోమెట్రిక్ అటెండెన్స్ కంపల్సరీ చేయబోతున్నారు. ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ విద్యార్థులందరికీ ఇది వర్తిస్తుందని జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్ మన్జూర్ అలీ పేర్కొన్నారు. ఇప్పటికే జేఎన్‌టీయూహెచ్ పరిధిలో అధ్యాపకులతో పాటు ఎంటెక్, ఎంఫార్మ్, ఇతర పీజీ విద్యార్థులకు బీఏఎస్ అమలు చేస్తున్నారు. ప్రతీ కాలేజీ ఈ బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకొని కాలేజీ సర్వర్లలో భద్రపరచాలని ఉత్తర్వులు జారీ చేశారు.
వాస్తవానికి అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో గతంలో బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకునేవాళ్లు. అయితే, కరోనా పాండమిక్ సమయంలో కాలేజీలో ఆన్‌లైన్ క్లాసులను నిర్వహించాయి. దీంతో బయోమెట్రిక్ అటెండెన్స్‌ను రద్దు చేసింది. ఇప్పుడు కాలేజీలో పూర్తి స్థాయిలో ప్రారంభం అయ్యాయి. ఆఫ్ లైన్ క్లాసులను మాత్రమే నడుపుతున్నాయి. అందుకే నవంబర్ నుంచి బయోమెట్రిక్ తిరిగి అమలు చేయాలని యూనివర్సిటీ నిర్ణయించింది. విద్యార్థులందరికీ బయోమెట్రిక్ అటెండెన్స్‌ను తప్పనిసరి చేయనున్నది. బయోమెట్రిక్ అటెండెన్స్‌ను తీసుకొని ప్రతీ 15 రోజులకు ఒకసారి యూనివర్సిటీ సర్వర్లలోకి కాలేజీ యాజమాన్యం అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. జేఎన్‌టీయూ పరిధిలోని కాలేజీల విద్యార్థుల హాజరు మొత్తం యూనివర్సిటీ అధికారులు యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. దీని వల్ల విద్యార్థుల మల్టిపుల్ ఎంట్రీ, ఎగ్జిట్ వివరాలు కూడా సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఇక ఏ కాలేజీలో అయినా అధ్యాపకుల అటెండెన్స్ తక్కువగా కనిపిస్తే ఆ కళాశాలలో ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఉన్నట్లుగా నమోదు చేస్తామని యూనివర్సిటీ హెచ్చరించింది. యూనివర్సిటీ తనిఖీలు జరిగినప్పుడే కొన్ని కాలేజీల్లో ఫ్యాకల్టీ ఉన్నట్లు చూపిస్తున్నారు. ఆ తర్వాత గెస్ట్ లెక్చరర్లలో వారానికి ఒకటో రెండో క్లాసులు చెప్పించి పంపుతున్నారు. అంతే కాకుండా కొంత మంది లెక్చరర్లు రెండు మూడు కాలేజీల్లో పని చేస్తున్నట్లు కూడా ఫిర్యాదులు ఉన్నాయి. వీటన్నింటికీ బయోమెట్రిక్ అటెండెన్స్ చెక్ పెడుతుందని రిజిస్ట్రార్ చెప్పారు.