Telugu Global
Telangana

జార్ఖండ్‌ ఎమ్మెల్యేలు అటు.. బిహార్ ఎమ్మెల్యేలు ఇటు

బిహార్‌ నుంచి 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు. బిహార్‌లో కొత్తగా కొలువుదీరిన జేడీయూ-బీజేపీ సంకీర్ణ సర్కార్‌ అక్కడి అసెంబ్లీలో ఈనెల 12న బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది.

జార్ఖండ్‌ ఎమ్మెల్యేలు అటు.. బిహార్ ఎమ్మెల్యేలు ఇటు
X

క్యాంప్ రాజకీయాలకు హైదరాబాద్‌ కేంద్రంగా మారింది. జార్ఖండ్‌ ఎమ్మెల్యేలు అలా వెళ్లారో లేదో.. బిహార్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు వచ్చారు. ఇవాళ జార్ఖండ్ శాసనసభలో బలనిరూపణ ఉండటంతో వారంతా ఓటు వేసేందుకు ఆదివారం సాయంత్రం వెళ్లారు. జార్ఖండ్‌ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేసే అవకాశాలున్నాయన్న అనుమానంతో వారిని హైదరాబాద్‌లో ఓ రిసార్టుకు తీసుకువచ్చి కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచారు.

ఇక బిహార్‌ నుంచి 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు. బిహార్‌లో కొత్తగా కొలువుదీరిన జేడీయూ-బీజేపీ సంకీర్ణ సర్కార్‌ అక్కడి అసెంబ్లీలో ఈనెల 12న బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బిహార్‌లోని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ప్రత్యేక విమానంలో పట్నా నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఇబ్రహీంపట్నంలోని ఓ రిసార్టుకు తరలించారు. ఇతరులు ఎవరు వారిని కలవకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఈనెల 12 వరకు బిహార్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రిసార్టులోనే ఉంచాలని ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసిందని సమాచారం.

ఇటీవల ఇండియా కూటమిని వీడిన‌ నితీశ్‌ కుమార్ ఎన్డీఏ కూటమిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. బిహార్‌ అసెంబ్లీలో మొత్తం 243 మంది సభ్యులుండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఎన్డీఏ కూటమిలోని బీజేపీకి 78, జేడీయూకు 45, హిందూస్థాన్ అవామీ మోర్చాకు నలుగురు ఎమ్మెల్యేలున్నారు. ఇక ఇండియా కూటమిలోని ఆర్జేడీకి 79, కాంగ్రెస్‌కు 22, లెఫ్ట్ పార్టీలకు 10 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు.

First Published:  5 Feb 2024 9:26 AM IST
Next Story