Telugu Global
Telangana

ఇసుక అక్రమ రవాణా కేసులో ట్విస్ట్‌.. సీజ్‌ చేసిన లారీలు మాయం

తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పోలీస్ కస్టడీలో ఉన్న ఇసుక లారీలు మిస్సింగ్‌ అయ్యాయి. ఇసుక వ్యవహారంలో సీజ్ చేసిన‌ 17 లారీలు పోలీస్ కస్టడీలో ఉండగా అందులో 10 లారీలు మాయ‌మ‌య్యాయని తెలుస్తోంది.

ఇసుక అక్రమ రవాణా కేసులో ట్విస్ట్‌.. సీజ్‌ చేసిన లారీలు మాయం
X

సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలతో ఏపీ నుంచి తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా చేసిన ఘటన ఇటీవల చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. రెండు రోజుల కిందట ఖమ్మం జిల్లాలో ఏపీ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 17 లారీలను మైనింగ్ అధికారులు సీజ్ చేశారు. ఈ కేసులో మంత్రి సీతక్క సహా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మరో మంత్రి పీఏల‌ను సస్పెండ్ చేసినట్లు సమాచారం.

అయితే తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పోలీస్ కస్టడీలో ఉన్న ఇసుక లారీలు మిస్సింగ్‌ అయ్యాయి. ఇసుక వ్యవహారంలో సీజ్ చేసిన‌ 17 లారీలు పోలీస్ కస్టడీలో ఉండగా అందులో 10 లారీలు మాయ‌మ‌య్యాయని తెలుస్తోంది. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు వాటిని సీజ్ చేసి పంచనామా అనంతరం బూర్గంపాడు పోలీసుల అదుపులో ఉంచారు. సీజ్‌ చేసిన లారీలకు కాపలాగా దాదాపు 10 సిబ్బందిని కూడా రక్షణగా ఉంచారు. అయినప్పటికీ లారీలు మాయం కావడం హాట్ టాపిక్‌గా మారింది. మాయమైన 10 లారీల్లో 3 లారీలను మళ్లీ అధికారులు స్వాధీనం చేసున్న‌ట్లు తెలుస్తోంది. మిగతా ఏడు లారీల కోసం సెర్చ్ చేస్తున్నామన్నారు పాల్వంచ ఏసీపీ.


ఇదే అంశంపై ట్విట్టర్‌లో స్పందించారు ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్, బీఆర్ఎస్ లీడర్ క్రిశాంక్. ఇసుక అక్రమ రవాణా కేసులో పట్టుబడితే ఫస్ట్‌ పోలీస్ కేసు నమోదు చేసి.. తర్వాత లారీలను TSMDC బ్లాక్ లిస్టులో పెడుతుందని.. కానీ, ఫస్ట్ టైమ్‌ పట్టుబడిన లారీలు మిస్‌ అయ్యాయన్నారు. లారీలు మాయం కావడం వెనుక మంత్రి సీతక్క హస్తం ఉందని ఆరోపించారు క్రిశాంక్.

First Published:  17 Feb 2024 1:21 PM GMT
Next Story