Telugu Global
Telangana

బీఆర్ఎస్‌కు భారీ షాక్.. ఆరుగురు ఎమ్మెల్సీలు జంప్‌

రాత్రి 11.30 గంటలకు జూబ్లిహిల్స్ సీఎం నివాసానికి చేరుకున్నారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకోగానే వారంతా పార్టీలో చేరారు.

బీఆర్ఎస్‌కు భారీ షాక్.. ఆరుగురు ఎమ్మెల్సీలు జంప్‌
X

కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ను మరింత వేగవంతం చేసింది. గురువారం అర్ధరాత్రి ఆరుగురు బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీలు కారు దిగి హస్తం గూటికి చేరారు. వీరందరికి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.


బీఆర్ఎస్‌ను వీడిన వారిలో దండె విఠల్, MS ప్రభాకర్, భాను ప్రసాదరావు, బస్వరాజు సారయ్య, యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్ ఉన్నారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో సమావేశమైన ఆరుగురు ఎమ్మెల్సీలు.. రాత్రి 11.30 గంటలకు జూబ్లిహిల్స్ సీఎం నివాసానికి చేరుకున్నారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకోగానే వారంతా పార్టీలో చేరారు. ఈ చేరికల కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ ఎమ్మెల్సీల చేరికతో 40 మంది సభ్యులున్న శాసనమండలిలో బీఆర్ఎస్‌ బలం 21కి పడిపోయినట్లు తెలుస్తోంది.

మరోవైపు బీఆర్ఎస్‌ను ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు వీడిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికలకు ముందు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు హస్తం కండువా కప్పుకోగా.. ఎన్నికల తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలె యాదయ్య హ‌స్తం తీర్థం పుచ్చుకున్నారు. ఇక గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సైతం కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

First Published:  5 July 2024 9:01 AM IST
Next Story