నిన్న మెదక్, నేడు మల్కాజిగిరి.. కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు
నందికంటితో పాటు వందలాది మంది కార్యకర్తలు హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పారు. అధికార పార్టీలో ఉన్నప్పుడు మైనంపల్లి తనపై, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించారన్నారు నందికంటి.
తెలంగాణ కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. మెదక్ డీసీసీ ప్రెసిడెంట్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి రాజీనామా నుంచి తేరుకోకముందే.. తాజాగా మేడ్చల్ డీసీసీ ప్రెసిడెంట్ నందికంటి శ్రీధర్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు AICC అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు రాజీనామా లేఖ పంపారు.
ఇటీవల పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంత రావుకు మల్కాజిగిరి టికెట్ ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ చెప్పడంతో నందికంటి శ్రీధర్ రాజీనామా చేశారు. ఇన్నాళ్లూ టికెట్ తనకే వస్తుందని భావించిన నందికంటి.. మైనంపల్లి చేరికతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. నందికంటితో పాటు వందలాది మంది కార్యకర్తలు హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పారు. అధికార పార్టీలో ఉన్నప్పుడు మైనంపల్లి తనపై, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించారన్నారు నందికంటి. అలాంటి వ్యక్తికి రెండు టికెట్లు ఇస్తారా అంటూ లేఖలో ప్రశ్నించారు. మైనంపల్లిని కాంగ్రెస్ కార్యకర్తలు తప్పకుండా ఓడిస్తారని చెప్పారు. బీసీలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
1994 నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు నందికంటి శ్రీధర్. గతంలో కౌన్సిలర్, కార్పొరేటర్ గానూ సేవలందించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా మల్కాజిగిరి స్థానాన్ని టీజేఎస్‌కు కేటాయించగా.. కపిలవాయి దిలీప్‌కుమార్ కోసం సీటు త్యాగం చేశారు. అయితే ఈసారి టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో ఉన్న నందికంటికి మైనంపల్లి రూపంలో షాక్ తగిలింది. దీంతో కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించారు.
ఇక ఆదివారం మెదక్ డీసీసీ ప్రెసిడెంట్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి సైతం పార్టీకి రాజీనామా చేశారు. మెదక్ స్థానాన్ని మైనంపల్లి రోహిత్‌కు ఖరారు చేయడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కాంగ్రెస్‌లో డబ్బు సంచులే ప్రాతిపదికగా ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు జిల్లా పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.