Telugu Global
Telangana

బీజేపీకి బిగ్‌షాక్.. ఆ హామీతో కాంగ్రెస్‌లో చేరిన జితేందర్ రెడ్డి

రాజీనామా అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు జితేందర్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

బీజేపీకి బిగ్‌షాక్.. ఆ హామీతో కాంగ్రెస్‌లో చేరిన జితేందర్ రెడ్డి
X

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. సీనియర్ లీడర్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తన రాజీనామా లేఖను పంపారు జితేందర్ రెడ్డి. ప్రధాని మోడీ, అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలిపారు.

బండి సంజయ్ స్టేట్‌ చీఫ్‌గా ఉన్న టైమ్‌లో తెలంగాణలో బీజేపీ మంచి స్థితిలో ఉందని, కానీ నాయకత్వాన్ని మార్చడంతో పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కనీసం 25 స్థానాలు సాధించలేకపోయిందన్నారు జితేందర్ రెడ్డి. లోక్‌సభ టికెట్ల విషయంలోనూ పార్టీలో ఇటీవల చేరిన వారికి ప్రాధాన్యత ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేకసార్లు ఈ విషయాలను రాష్ట్ర, కేంద్ర నాయకత్వాల దృష్టికి తీసుకెళ్లానని, కానీ ఫలితం లేదన్నారు.


రాజీనామా అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు జితేందర్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. జితేందర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు ఏ.పీ.మిథున్ రెడ్డి సైతం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

మహబూబ్‌నగర్ నుంచి బీజేపీ టికెట్ ఆశించారు జితేందర్ రెడ్డి. అయితే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డి.కె.అరుణకు అవకాశమిచ్చింది. దీంతో అసంతృప్తిలో ఉన్న జితేందర్ రెడ్డిని.. నిన్న‌ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయ‌న ఇంటికి వెళ్లి క‌లిశారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. జితేందర్ రెడ్డిని మల్కాజ్‌గిరి బరిలో ఉంచే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.

First Published:  15 March 2024 10:23 PM IST
Next Story