Telugu Global
Telangana

మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్‌కు బిగ్ రిలీఫ్‌.. పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

2018లో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీ‌నివాస్‌గౌడ్ ఎన్నిక చెల్ల‌దంటూ రాఘ‌వేంద‌ర్‌రాజు అనే వ్య‌క్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు విచార‌ణ జ‌రిపి, ఈ రోజు తీర్పు వెలువ‌రించింది.

మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్‌కు బిగ్ రిలీఫ్‌.. పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
X

తెలంగాణ మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్‌కు హైకోర్టు శుభవార్త చెప్పింది. 2018లో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీ‌నివాస్‌గౌడ్ ఎన్నిక చెల్ల‌దంటూ రాఘ‌వేంద‌ర్‌రాజు అనే వ్య‌క్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు విచార‌ణ జ‌రిపి, ఈ రోజు తీర్పు వెలువ‌రించింది. శ్రీ‌నివాస్‌గౌడ్ ఎన్నిక చెల్ల‌ద‌న్న పిటిష‌న్‌ను కొట్టివేసింది. ఎన్నిక‌ల వేళ మంత్రికి ఇది పెద్ద రిలీఫ్‌.

ఆస్తుల వివరాల‌పై త‌ప్పుడు అఫిడ‌విట్ స‌మ‌ర్పించార‌ని పిటిష‌న్

2018 ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో శ్రీ‌నివాస్‌గౌడ్ త‌న ఆస్తుల వివ‌రాల‌ను త‌ప్పుగా స‌మ‌ర్పించారని రాజు త‌న పిటిషన్‌లో పేర్కొన్నారు. త‌ర్వాత దాన్ని తీసుకుని, స‌వ‌రించి మ‌ళ్లీ అఫిడ‌విట్ ఇచ్చార‌ని, అలా ఇవ్వ‌డం రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని కోర్టులో పిటిష‌న్ వేశారు. ఆయ‌న ఎన్నిక చెల్ల‌ద‌ని తీర్పివ్వాల‌ని వాదించారు. ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న కోర్టు ఆ పిటిష‌న్‌ను కొట్టివేసింది.

ఇప్ప‌టికే ముగ్గురిపై పిటిష‌న్లు

అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల‌పై ఇప్ప‌టికే అన‌ర్హ‌త వేటుప‌డింది. విదేశీ పౌర‌స‌త్వం విష‌యంలో చెన్న‌మ‌నేని ర‌మేష్‌పై , అఫిడ‌విట్‌ల విష‌యంలో భాగంగానే గ‌ద్వాల ఎమ్మెల్యే కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి, కొత్త‌గూడెం ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావుల‌పై కోర్టు అన‌ర్హ‌త వేటేసింది. అయితే వీరిలో ర‌మేష్‌కు సుప్రీంకోర్టులో ఊర‌ట ల‌భించింది. కృష్ణ‌మోహ‌న్‌, వ‌న‌మాలు మ‌ళ్లీ పిటిష‌న్ వేయ‌డంతో అన‌ర్హ‌త నిర్ణ‌యం ఇంకా సందిగ్దంగానే ఉంది. ఈ ప‌రిస్థితుల్లో హైకోర్టులోనే పిటిష‌న్ కొట్టివేయ‌డం మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్‌కు ఎన్నిక‌ల్లో నైతికంగా మంచి బ‌లం చేకూరిన‌ట్టే.


First Published:  10 Oct 2023 12:31 PM IST
Next Story