గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి బిగ్ రిలీఫ్.. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే
గద్వాల్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ లీడర్ కృష్ణమోహన్‌రెడ్డి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని, ఆయన ఎన్నిక చెల్లదంటూ ఆయన ప్రత్యర్థి, అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి, ప్రస్తుత బీజేపీ నేత డీకే అరుణ కోర్టుకెళ్లారు.
గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో గత కొన్నిరోజులుగా జరుగుతున్న ఎమ్మెల్యే అనర్హత వ్యవహారం మరో మలుపు తీసుకున్నట్లయింది. ఇప్పటికే ఎమ్మెల్యేగా ధృవపత్రం కూడా అందుకున్న డీకే అరుణ ఇప్పుడు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
రెండు వారాల్లో కౌంటర్లు వేయండి
గద్వాల్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ లీడర్ కృష్ణమోహన్‌రెడ్డి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని, ఆయన ఎన్నిక చెల్లదంటూ ఆయన ప్రత్యర్థి, అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి, ప్రస్తుత బీజేపీ నేత డీకే అరుణ కోర్టుకెళ్లారు. దీన్ని విచారించిన హైకోర్టు గత నెలలో అరుణకు అనుకూలంగా తీర్పు చెప్పింది. కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదని, రెండో స్థానంలో నిలిచిన డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించాలని ఆదేశించింది.
డీకే అరుణ ఇప్పుడేం చేస్తారు?
కోర్టు ఆదేశాలతో తనను ఎమ్మెల్యేగా గుర్తించాలని డీకే అరుణ విజ్ఞప్తి చేశారు. ఆమెను ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలిచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి, అసెంబ్లీ సెక్రటరీకి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి అరుణ సిద్ధమవుతున్నారు. ఈలోగా కృష్ణమోహన్‌రెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆయన పిటిషన్‌ను విచారించి, హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది. కౌంటర్లు వేయాలని ఎన్నికల సంఘానికి, డీకే అరుణకు నోటీసులిచ్చింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. దీంతో నెల రోజులపాటు అరుణ ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి లేనట్లే.