ఎల్బీ నగర్ సీటు కోసం పోటీ.. బీజేపీలో బయటపడుతున్న లుకలుకలు
ఎల్బీనగర్ పరిధిలో అత్యధిక కార్పొరేటర్లు గెలవడంతో బీజేపీ సీటు దక్కించుకోవాలని ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. గెలిచిన కార్పొరేటర్లలో తొమ్మిది మంది ఈ సారి అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తుండటం గమనార్హం.
జీహెచ్ఎంసీ పరిధిలోని ఎల్బీనగర్ అసెంబ్లీ సీటు ఇప్పుడు బీజేపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఏ పార్టీ నుంచైనా పోటీ చేయాలని భావించే ఆశావహులు నాలుగురైదుగురు ఉంటారు. కానీ ఎల్బీనగర్‌లో బీజేపీ టికెట్‌ను దాదాపు 20 మంది ఆశిస్తున్నారు. ఇందుకు ప్రత్యేకమైన కారణం కూడా ఉన్నది. ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని 11 జీహెచ్ఎంసీ డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లే గెలిచారు. లింగోజిగూడలో తొలుత గెలిచిన బీజేపీ కార్పొరేటర్ కరోనా కారణంగా మరణించారు. ఆ తర్వాత ఆ సీటును కాంగ్రెస్ గెలిచింది.
అత్యధిక కార్పొరేటర్లు గెలవడంతో బీజేపీ సీటు దక్కించుకోవాలని ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. గెలిచిన కార్పొరేటర్లలో తొమ్మిది మంది ఈ సారి అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తుండటం గమనార్హం. కేవలం స్థానిక కార్పొరేటర్లే కాకుండా కొంత మంది రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఈ సీటుపై కన్నేశారు. ఇక్కడి నుంచి పోటీ చేస్తే కచ్చితంగా అసెంబ్లీలో కాలు పెట్టొచ్చని భావించడమే ఈ పోటీకి కారణం. ఇప్పటికే ఎల్బీనగర్ సీటు ఆశిస్తున్న బీజేపీ నేతలు అధిష్టానాన్ని మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తున్నది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉండటంతో.. ఇప్పటి నుంచే టికెట్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇది సెగ్మెంట్‌లో బీజేపీ నాయకుల మధ్య చిచ్చు పెడుతోంది.
నియోజకవర్గంలోని సమస్యలపై ఇటీవల పోరాటాలు చేయాలని బీజేపీ పిలుపునిచ్చింది. అయితే అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న నేతలు.. ఎవరికి వారే తమ అనుచరులను వేసుకొని విడివిడిగా ఎల్బీనగర్ మున్సిపల్ సర్కిల్ ఆఫీస్ ఎదుట ధర్మాలకు దిగారు. విడతల వారీగా నిరసనలకు దిగడం స్థానికులను ఆశ్చర్యపరిచింది. టికెట్ ఆశిస్తున్న నేతలు తమ బలం నిరూపించుకోవడానికే ఇలా ప్రత్యేక పోరాటాలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల బండి సంజయ్ పాదయాత్ర ఈ నియోజకవర్గం మీదుగా వెళ్లినప్పుడు.. జనసమీకరణ కోసం కార్పొరేటర్లు పోటీ పడ్డారు. తమకు టికెట్ కేటాయించమని కొందరు అప్పుడే బండి సంజయ్‌కి వినతులు కూడా సమర్పించినట్లు తెలుస్తున్నది.
బీజేపీ కార్పొరేటర్లు వంగా మధుసూదన్ రెడ్డి, కొప్పుల నర్సింహారెడ్డి ఎమ్మెల్యే టికెట్ కోసం భారీ అంచనాలు పెట్టుకున్నారు. అధిష్టానం దృష్టిలో పడటానికి వీరిద్దరూ నానా తంటాలు పడుతున్నారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన పేరాల చంద్రశేఖర్ రావు అధిష్టానానికి వ్యతిరేకంగా ట్విట్టర్‌లో కొన్ని పోస్టులు పెట్టారు. ఇది ఆయనకు మైనస్‌గా మారింది. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుండటంతో.. ఆయనకు టికెట్ రాదని.. తనకే వస్తుందని కొంత మంది కార్పొరేటర్లు చెప్పుకుంటున్నారు.
2018 ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసిన సామ రంగారెడ్డి కూడా ఎల్బీనగర్ సీటును ఆశిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సామ.. తనకే ఈ సీటు కేటాయించాలని పట్టుబడుతున్నారు. మరోవైపు మునుగోడు సీటును త్యాగం చేసిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి ఈ సారి తనకు ఎల్బీనగర్ టికెట్ కేటాయించాలని కోరుతున్నట్లు సమాచారం. ఇక ఇతర నియోజకవర్గాల కంటే ఎల్బీనగర్ సేఫ్ అని భావిస్తున్న మరి కొందరు సీనియర్ బీజేపీ నాయకులు కూడా ఈ సీటును ఆశిస్తున్నట్లు తెలుస్తున్నది.
ఒక వైపు స్థానిక కార్పొరేటర్లు, మరో వైపు బీజేపీ సీనియర్ నేతలు.. మొత్తంగా దాదాపు 20 మంది ఎల్బీనగర్ సీటు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎవరికి వారే అన్నట్లు పోటాపోటీగా పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. వీరిందరినీ సంతృప్తి పరచడం అధిష్టానానికి ఇప్పుడు తలనొప్పులు తెస్తోంది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే ఒక నియోజకవర్గం టికెట్ కోసం పోటీ నెలకొనడం కూడా రాష్ట్ర నాయకత్వాన్ని ఆశ్చర్యపరుస్తోంది.
టికెట్ ఆశిస్తున్న వారిలో ఎవరికి టికెట్ కేటాయించినా.. మరొకరు తప్పకుండా వారికి వ్యతిరేకంగా పని చేస్తారనే ఆందోళన కూడా ఉన్నది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఇక్కడి నుంచి పోటీ చేయాలని కొంత మంది కోరినట్లు సమాచారం. అయితే స్థానికేతరులకు టికెట్ కేటాయించవద్దని.. అది పార్టీకి మైనస్ అవుతుందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, ఎల్బీనగర్‌లో గత రెండు ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన పార్టీ.. రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడం గమనార్హం. ఈ సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకొని సంజయ్‌ను పోటీ చేయవద్దని కొంత మంది నేతలు సూచించినట్ల చెబుతున్నారు. మొత్తానికి ఈ సెగ్మెంట్ టికెట్ కారణంగా ప్రస్తుతం బీజేపీ నాయకుల మధ్య పోటీ నెలకొన్నది. ఎవరికి వారే తమకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకుంటుండటంతో పార్టీలో విభేదాలు తలెత్తుతున్నాయి.