ధరణి స్థానంలో ''భూమాత''
దేశానికే రోల్ మోడల్ గా ఈ పోర్టల్ : మంత్రి పొంగులేటి
ధరణి పోర్టల్ స్థానంలో ''భూమాత'' పోర్టల్ తీసుకురాబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ పోర్టల్ దేశానికే రోల్ మోడల్ గా ఉండబోతుందని తెలిపారు. ధరణి పోర్టల్ లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పెట్టబోతున్నామని ప్రకటించారు. టెక్నికల్ గాను సమస్యలు ఎదురుకాకుండా చూస్తున్నామన్నారు. ధరణి పోర్టల్ లో ఏదైనా అప్లికేషన్ తిరస్కరిస్తే సివిల్ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉండేదని, ఇకపై ఆన్‌లైన్ లోనే అప్పీల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. ధరణి పోర్టల్ పై ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులు, క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలు, వివిధ వర్గాల నుంచి సేకరించిన అభిప్రాయాల మేరకు అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేలా కొత్త పోర్టల్ ఉండబోతుందని మంత్రి వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ధరణి పోర్టల్ ను ప్రక్షాళన చేశామని.. త్వరలోనే భూమాత పోర్టల్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు.