Telugu Global
Telangana

మూసీపై భట్టి చర్చకు సిద్ధమా

మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి సవాల్‌

మూసీపై భట్టి చర్చకు సిద్ధమా
X

రూ.1.50 లక్షల కోట్లతో మూసీ ప్రాజెక్టు చేపడుతామన్న విషయంలో డిప్యూటీ సీఎం చర్చకు సిద్ధమా అని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి సవాల్‌ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌ రెడ్డి తన తాబేదార్ల కోసమే హైడ్రా, మూసీ ప్రాజెక్టులు తెచ్చారన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా రూ.1.50 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ చేపడుతామని చెప్పారని గుర్తు చేశారు. అసలు మూసీ ప్రాజెక్టుపై ఎప్పుడైనా కేబినెట్‌ లో చర్చ జరిగిందా చెప్పాలని భట్టిని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో చర్చకు వస్తారా అని భట్టిని ప్రశ్నించారు. బడే భాయ్‌ మోదీ నోట్ల రద్దుతో దేశ ఆర్థిక రంగాన్ని నాశనం చేస్తే, హైడ్రా పేరుతో చోటే భాయ్‌ తెలంగాణణు నాశనం చేస్తున్నారని అన్నారు. ఢిల్లీకి కప్పం కట్టేందుకే రేవంత్‌ మూసీ సుందరీకరణ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారన్నారు. హైడ్రా పేరుతో ఇప్పటికే రూ.వెయ్యి కోట్ల విలువైన పేదల ఇండ్లను కూల్చారని తెలిపారు. ఎఫ్‌టీఎల్‌ లో ఉన్న అన్ని నిర్మాణాలు కూలగొట్టే దమ్ము ముఖ్యమంత్రికి ఉందా అని ప్రశ్నించారు. డబ్బుల కోసం హైదరాబాద్ బ్రాండ్‌ ఇమేజీని దెబ్బతీస్తున్నారని అన్నారు. అబద్ధాల్లో రేవంత్‌ ను భట్టి మించిపోతున్నారని అన్నారు. బుకాయింపులతో ప్రభుత్వాన్ని ఎంతకాలం నడుపుతారని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణకు సంబంధించిన ప్రణాళిక ప్రభుత్వం దగ్గర ఉందా? మూసీ నీళ్లను మురికినీళ్లుగా మార్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కాదా అని ప్రశ్నించారు. నల్గొండలో ఫ్లోరైడ్‌ మహమ్మారికి కాంగ్రెస్‌ పార్టీ కారణమని, ఫ్లోరోసిస్‌ ను బీఆర్‌ఎస్‌ రూపుమాపిందన్నారు. రూ.16 వేల కోట్లతో మూసీ ప్రక్షాళనను బీఆర్‌ఎస్‌ ప్రారంభిస్తే దానిని రూ.1.50 లక్షల కోట్లకు పెంచారని మండిపడ్డారు. నల్గొండ జిల్లాకు కొండపోచమ్మసాగర్‌, హిమాయత్‌ సాగర్‌ మీదుగా నీళ్లు తీసుకురావడానికి కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని, ఈప్రభుత్వానికి చేతకాకపోతే ఆ పని చేయడానికి తాము రెడీగా ఉన్నామన్నారు. ప్రజలు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, ఇలాంటి నియంతలు చాలా మంది పోయారన్నారు. సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తున్న వారికి లుక్‌ ఔట్‌ నోటీసులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. సోషల్‌ మీడియాను చూసి రేవంత్‌ రెడ్డి భయపడుతున్నారని అన్నారు. స్థానిక పరిస్థితుల కారణంగానే హర్యానా ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని అన్నారు.

First Published:  8 Oct 2024 4:24 PM IST
Next Story