Telugu Global
Telangana

ఖమ్మంలో పొంగులేటి డామినేషన్‌పై గుర్రుగా ఉన్న భట్టి, రేణుక వర్గం!

కాంగ్రెస్‌లో చేరక ముందు భట్టిని స్వయంగా కలిసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. తాను పార్టీలో వర్గాలు సృష్టించనని.. అందరితో కలిసి పని చేస్తానని మాట ఇచ్చారు.

ఖమ్మంలో పొంగులేటి డామినేషన్‌పై గుర్రుగా ఉన్న భట్టి, రేణుక వర్గం!
X

ఖమ్మం కాంగ్రెస్‌లో అసమ్మతి బద్దలవడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉన్నది. కొత్తగా పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధిపత్యాన్ని భట్టి విక్రమార్క, రేణుక చౌదరి వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఖమ్మంలో భారీ సభ నిర్వహించి.. రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరిన దగ్గర నుంచి జిల్లాలో పొంగులేటి తన ఆధిపత్యాన్ని మరింతగా పెంచారని పార్టీలో చర్చ జరుగుతున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను.. 60 శాతానికి పైగా సీట్లలో తన అనుచరులదే హవా ఉండేలా చూసుకుంటున్నారు.

కాంగ్రెస్‌లో చేరక ముందు భట్టిని స్వయంగా కలిసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. తాను పార్టీలో వర్గాలు సృష్టించనని.. అందరితో కలిసి పని చేస్తానని మాట ఇచ్చారు. తీరా పార్టీలో చేరిన తర్వాత తన అసలు రూపాన్ని బయటపెట్టుకుంటున్నారని భట్టి వర్గం ఆరోపిస్తోంది. మల్లు భట్టి విక్రమార్క మధిర అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వరుసగా మూడు సార్లు గెలిచారు. 2014, 2018లో ఉమ్మడి జిల్లా నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచిన అందరూ అధికార బీఆర్ఎస్‌లో చేరారు. కానీ, భట్టి ఒక్కరే కాంగ్రెస్‌లో మిగిలిపోయారు. అప్పటి నుంచి తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకొని జిల్లా రాజకీయాలను శాసిస్తున్నారు.

మరోవైపు ఎప్పటి నుంచో జిల్లాపై రేణుక చౌదరి ప్రభావం కూడా ఉన్నది. ఏఐసీసీ స్థాయిలో లాబీయింగ్ చేయగలిగే నాయకురాలు కావడంతో.. జిల్లాలో ఆమె వర్గం కూడా కాంగ్రెస్‌లో బలంగా ఉన్నది. రాబోయే ఎన్నికల్లో భట్టి, రేణుక వర్గానికి చెందిన నాయకులు తమకు టికెట్లు వస్తాయని ఆశ పెట్టుకున్నారు. కానీ, పొంగులేటి ఎంట్రీతో సీన్ పూర్తిగా మారిపోయిందని తెలుస్తున్నది. ఉమ్మడి జిల్లాలోని పినపాక, ఇల్లెందు, వైరా, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో తనతో పాటు తన అనుచరులను నిలబెట్టడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. భద్రాచలంలో కూడా తన అభ్యర్థే ఉండేలా పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది.

మల్లు భట్టి విక్రమార్క సత్తుపల్లిలో మట్టా దయానంద్‌కు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. మొదట్లో పొంగులేటి వర్గంగా ఉన్న దయానంద్.. చివరి నిమిషంలో ఆయనకు హ్యాండ్ ఇచ్చి ముందుగానే కాంగ్రెస్‌లో చేరారు. దయానంద్‌ను పార్టీలోకి తీసుకొని రావడానికి భట్టి కారణమని తెలుస్తున్నది. సత్తుపల్లి టికెట్ ఇస్తాననే హామీతోనే దయానంద్‌ను పార్టీలో చేర్చుకున్నారు. అయితే, తనను కాదని ముందుగానే వెళ్లిన దయానంద్‌పై పొంగులేటి కోపంగా ఉన్నట్లు తెలుస్తున్నది. సత్తుపల్లిలో నిలబెట్టడానికి ప్రభుత్వ ఉద్యోగి అయిన కొండూరి సుధాకర్‌ను రాజీనామా చేయించి మరీ పార్టీలో జాయిన్ చేశారు. దీంతో ఈ టికెట్ కోసం భట్టి వర్సెస్ పొంగులేటిగా మారిపోయింది.

ఇక రేణుక చౌదరి ఖమ్మం టికెట్‌ను ఆశిస్తున్నట్లు తెలిసింది. తనకు ఇవ్వకపోయినా తన వర్గానికి చెందిన నాయకులకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. పొంగులేటిని కొత్తగూడెం నుంచి పోటీ చేయించి.. తన వర్గానికి టికెట్ ఇవ్వాలని ఆమె పట్టుబడుతున్నారు. అయితే పొంగులేటి మాత్రం ఖమ్మం లేదా కొత్తగూడెం.. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తున్నది. ఉమ్మడి జిల్లాలోని పినపాక, ఇల్లెందులో కూడా తమ వర్గానికి చెందిన వారికే రేణుక, భట్టి టికెట్లు కోరుతున్నారు. కానీ వారి మాట చెల్లుబాటు కాకపోవడంతో ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తున్నది.

ప్రస్తుతానికి ఇరు వర్గాల నాయకులు సైలెంట్‌గానే ఉన్నా.. ఎన్నికల సమయానికి అసమ్మతి తప్పకుండా బయటపడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. అదే జరిగితే కాంగ్రెస్‌లో మళ్లీ గొడవలు ప్రారంభమవుతాయని.. గతంలో కూడా టికెట్ల కోసం ఏకంగా ఖమ్మం పార్టీ కార్యాలయంపై రేణుక చౌదరి వర్గం దాడి చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరి ఏఐసీసీ ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నదో వేచి చూడాలి.

First Published:  3 Aug 2023 2:07 PM IST
Next Story