Telugu Global
Telangana

ఇంటికే రానున్న భద్రాది రాములోరి కల్యాణ తలంబ్రాలు

శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలను కోరుకున్న భ‌క్తుల ఇళ్ల‌కు చేర్చాల‌ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది.

ఇంటికే రానున్న భద్రాది రాములోరి కల్యాణ తలంబ్రాలు
X

శ్రీరామ నవమి సందర్భంగా రాములోరి కల్యాణ తలంబ్రాలను భ‌క్తుల ఇళ్ల‌కు చేర్చాల‌ని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో ఇవాళ భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్‌ పోస్టర్‌ను ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఆవిష్కరించి.. తలంబ్రాల బుకింగ్‌‌కు శ్రీకారం చుట్టారు. భద్రాద్రిలో ఏప్రిల్ 6న అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని టీజీఎస్ఆర్టీసీ కోరుతోంద‌ని సంస్థ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని లాజిస్టిక్స్ కౌంటర్లతో పాటు ఆన్‌లైన్ ద్వారా కూడా తలంబ్రాలను బుక్‌ చేసుకోవచ్చని చెప్పారు.

సంస్థ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని తెలిపారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీజీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్‌ నంబర్లైన 040-69440069, 040-69440000ను సంప్రదించాలని సూచించారు. తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను హోం డెలివ‌రీ చేసే పవిత్ర కార్యానికి సంస్థ‌ శ్రీకారం చుట్టింది. త‌లంబ్రాలు కావాల్సిన భక్తులు టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల‌తో పాటు సంస్థ వెబ్‌సైట్ tgsrtclogistics.co.in లో రూ.151 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాలి. శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు సంస్థ హోం డెలివరీ చేస్తుంది.

First Published:  17 March 2025 10:45 PM IST
Next Story