Telugu Global
Telangana

భవన నిర్మాణ కార్మికులకు 'భాగ్య'నగరం..

హైదరాబాద్ లో భవన నిర్మాణ కార్మికులకు బాగా డిమాండ్ ఉంది. పొరుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు.. ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర నుంచి కూడా కూలీలు పెద్ద ఎత్తున హైదరాబాద్ కి వలస వస్తుంటారు.

భవన నిర్మాణ కార్మికులకు భాగ్యనగరం..
X

హైదరాబాద్ లో నివాస గృహాలకు, ఆఫీస్ లకు డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసు. ఇతర మెట్రో నగరాలను తలదన్ని ఆఫీస్ స్పేస్ వినియోగంలో హైదరాబాద్ నెంబర్-1 స్థానంలో నిలిచింది. అపార్ట్ మెంట్లు, ఇండివిడ్యువల్ హౌస్ ల అమ్మకాల్లో కూడా హైదరాబాద్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. అంటే హైదరాబాద్ లో నిర్మాణాలు కూడా ఆ స్థాయిలో జరుగుతున్నాయని తేలిపోయింది. ఆ స్థాయిలో నిర్మాణాలు జరుగుతున్న హైదరాబాద్ లో కార్మికులకు అదే స్థాయిలో కూలీలు గిట్టుబాటవుతున్నాయి. దేశంలో ఏ ఇతర రాష్ట్రంలోనూ తెలంగాణలో ఉన్నంత కూలీలు లేవు. దేశంలో ఏ ఇతర నగరంలోనూ హైదరాబాద్ లో ఇచ్చినంత రోజుకూలీ ఇవ్వట్లేదు.

హైదరాబాద్ లో భవన నిర్మాణ కార్మికులకు బాగా డిమాండ్ ఉంది. పొరుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు.. ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర నుంచి కూడా కూలీలు పెద్ద ఎత్తున హైదరాబాద్ కి వలస వస్తుంటారు. ఇందులో మెజారిటీ వాటా ఉత్తర ప్రదేశ్ దే. హైదరాబాద్ లో పనిచేసే భవన నిర్మాణ కార్మికులలో 42శాతం మంది ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చినవారే కావడం విశేషం.

జీతభత్యాలు ఇలా..

ఇతర మెట్రో నగరాల్లో ఎక్కడా గరిష్ట కూలీ వెయ్యి రూపాయలు దాటలేదు. హైదరాబాద్ లో మాత్రం గరిష్టంగా రోజు కూలీ వెయ్యి రూపాయల వరకు గిట్టుబాటు అవుతోంది. నిర్మాణ రంగంలో పనిని బట్టి 584 రూపాయలనుంచి 1035 రూపాయల వరకు హైదరాబాద్ లో కూలీలు ఇస్తున్నారు. మిగతా మెట్రో నగరాలతో పోల్చి చూస్తే ఈ కూలీ చాలా ఎక్కువ. అందుకే ఇతర రాష్ట్రాలనుంచి కూడా నిర్మాణ రంగంలోని కార్మికులు హైదరాబాద్ కి వలస వస్తున్నారు.

నిర్మాణ రంగంలో మేస్త్రీలకు ఇచ్చే కూలీ ఢిల్లీలో అత్యల్పం. అక్కడ సగటున మేస్త్రీలకు 718 రూపాయలు మాత్రమే రోజుకూలీ లభిస్తుంది. హైదరాబాద్ విషయానికొస్తే అది 862 రూపాయలు. అయితే అవసరాన్ని బట్టి వెయ్యి రూపాయల వరకు కాంట్రాక్టర్లు మేస్త్రీలకు కూలీ ఇవ్వడం విశేషం. ఇక మేస్త్రీతోపాటు వచ్చే సహాయకులకు కూడా ఢిల్లీలోనే కనిష్ట కూలీ ఇస్తున్నారు. హెల్పర్స్ కి ఢిల్లీలో రోజు కూలీ 515 రూపాయలు కాగా, ముంబైలో 536, పుణెలో 543, బెంగళూరులో 552, చెన్నైలో 565, హైదరాబాద్ లో గరిష్టంగా 585 రూపాయలు ఇస్తున్నారు. సూపర్వైజర్లకు కూడా హైదరాబాద్ మంచి డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ కి తగ్గట్టే సూపర్వైజర్లకు రోజుకి 1035 రూపాయలు ఇస్తున్నారు. పుణెలో సూపర్వైజర్లకు రోజుకి 885 రూపాయలు మాత్రమే గిట్టుబాటవుతోంది. నిర్మాణ రంగంలో పనిచేసే అన్ని కేటగిరీలవారికీ హైదరాబాద్ లోనే అత్యధిక కూలీ గిట్టుబాటవుతోంది.

First Published:  24 Jan 2023 9:18 AM IST
Next Story