Telugu Global
Telangana

జూపల్లి చేరికకు ముందే.. కొల్లాపూర్ కాంగ్రెస్‌లో విభేదాలు!

జూపల్లి కృష్ణారావు తిరిగి కాంగ్రెస్‌లో చేరడానికి ముందే కొల్లాపూర్ కాంగ్రెస్‌లో లొల్లి మొదలైంది. చాలా ఏళ్లుగా ప్రత్యర్థులుగా ఉన్న జూపల్లి కృష్ణారావు, చింతలపల్లి జగదీశ్వర్ రావు మధ్య మళ్లీ విభేదాలు మొదలయ్యాయి.

జూపల్లి చేరికకు ముందే.. కొల్లాపూర్ కాంగ్రెస్‌లో విభేదాలు!
X

బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఒకే సారి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇద్దరూ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడారు. ఈ నెల 2న ఖమ్మంలో జరిగిన సభలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీలో చేరారు. అయితే జూపల్లి కృష్ణారావు మాత్రం కొల్లాపూర్‌లో సభ పెట్టి జాయిన్ అవుతానని ప్రకటించారు. ఈ నెల 30న ప్రియాంక గాంధీతో భారీ బహిరంగ సభ ప్లాన్ చేశారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మహిళా డిక్లరేషన్ విడుదల చేయడంతో పాటు.. కృష్ణారావును చేర్చుకోవడానికి నిర్ణయించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రస్తుతం ఆ బహిరంగ సభను ఆగస్టు 5కు వాయిదా వేశారు.

కాగా, జూపల్లి కృష్ణారావు తిరిగి కాంగ్రెస్‌లో చేరడానికి ముందే కొల్లాపూర్ కాంగ్రెస్‌లో లొల్లి మొదలైంది. చాలా ఏళ్లుగా ప్రత్యర్థులుగా ఉన్న జూపల్లి కృష్ణారావు, చింతలపల్లి జగదీశ్వర్ రావు మధ్య మళ్లీ విభేదాలు మొదలయ్యాయి. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ తనకే ఇవ్వాలని చింతలపల్లి డిమాండ్ చేస్తున్నారు. అయితే కొల్లాపూర్ టికెట్ ఇస్తేనే జాయిన్ అవుతానని కృష్ణారావు ముందుగానే కాంగ్రెస్ పెద్దల వద్ద మాట తీసుకోవడం గమనార్హం.

కొల్లాపూర్ నియోజకవర్గంలో 2009, 2012 ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావు, చింతలపల్లి జగదీశ్వర్ ఒకరిపై ఒకరు పోటీకి దిగారు. ఆ తర్వాత ఇద్దరూ కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరారు. అయితే, జగదీశ్వర్‌కు ఆశించిన పదవి దక్కకపోవడంతో ఆయన తిరిగి కాంగ్రెస్ బాట పట్టారు. అప్పటి నుంచి తనకే టికెట్ దక్కుతుందనే ఆశతో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఇప్పుడు జూపల్లి తిరిగి కాంగ్రెస్ గూటికి వస్తుండటంతో మళ్లీ విభేదాలు మొదలయ్యాయి. జూపల్లి ఇంకా కాంగ్రెస్‌లో చేరకముందే ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రియాంకా గాంధీ సభ ముందు ఇలా ఇద్దరు నాయకుల కొట్లాడుకుంటుండటం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది.

జూపల్లికి దాదాపు కొల్లాపూర్ టికెట్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో జగదీశ్వర్ వర్గం కొల్లాపూర్‌లో అసమ్మతికి తెరలేపింది. ఇరు వర్గాల మధ్య నిత్యం మాటల యుద్దం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో సర్వే ప్రాతిపదికనే టికెట్లను కేటాయిస్తామంటూ మల్లు రవి వ్యాఖ్యానించారు. జూపల్లి రాకను కేవలం జగదీశ్వర్ మాత్రమే కాకుండా మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇన్నాళ్లూ పార్టీని నమ్ముకొని ఉంటే.. ఎన్నికల ముందు పార్టీలో చేరుతున్న వారికి టికెట్లు ఇవ్వడం సమంజసం కాదని నాగం వాదిస్తున్నారు.

జూపల్లికి వ్యతిరేకంగా చింతలపల్లి, నాగం వర్గాలు నియోజకవర్గంలో ప్రచారం మొదలు పెట్టాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. పార్టీలో చేరుతున్నాడని టికెట్ ఇవ్వవద్దని.. సర్వేల ప్రకారమే టికెట్లు కేటాయించాలని నాగం, చింతలపల్లి వర్గం పట్టుబడుతోంది. అయితే ప్రియాంక సభ జరిగే వరకు కలిసికట్టుగా పని చేయాలని.. ఆ తర్వాత ఈ సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకొని వెళ్తామని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం బుజ్జగిస్తున్నట్లు తెలుస్తున్నది.

First Published:  28 July 2023 7:26 AM IST
Next Story