Telugu Global
Telangana

మండే ఎండలు.. బీర్ అమ్మకాల్లో రికార్డ్ లు

ఏప్రిల్ నుంచి ఎండలు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్ లో అత్యథిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో యువత సహజంగానే బీర్లు తాగి సేదతీరాలనుకుంటోంది.

మండే ఎండలు.. బీర్ అమ్మకాల్లో రికార్డ్ లు
X

ఎండా కాలంలో కూల్ డ్రింక్స్ అమ్మకాలు భారీగా పెరుగుతాయి, అందులో అనుమానమేం లేదు. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు.. ఇంకా చెప్పాలంటే సన్ స్క్రీన్ లోషన్లు, గొడుగుల అమ్మకాల్లో కూడా పెరుగుదల ఉంటుంది. అంతేనా, అంతకు మించి ఇంకోటి ఉంది. అవును, బీర్ల అమ్మకాలు ఎండాకాలంలో భారీగా పెరుగుతాయి. కానీ, ఈ ఏడాది హైదరాబాద్ లో రికార్డులు బద్దలయ్యాయి.

ఏప్రిల్ నుంచి ఎండలు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్ లో అత్యథిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో యువత సహజంగానే బీర్లు తాగి సేదతీరాలనుకుంటోంది. ఏప్రిల్ 1 నుంచి 17వ తేదీ వరకు జరిగిన బీర్ల అమ్మకాల లెక్కతీస్తే సరికొత్త రికార్డుల వివరాలు బయటపడ్డాయి. ఏప్రిల్ లో కేవలం 17 రోజుల వ్యవధిలోనే హైదరాబాద్ లో కోటికి పైగా బీర్లు అమ్ముడయ్యాయి. గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. మూడు జిల్లాల్లో 8,46,175 కేస్‌ ల బీర్లు అమ్ముడైనట్టు ఆబ్కారీ శాఖ ప్రకటించింది. కేస్ కి 12 బీరు సీసాల లెక్కన మొత్తం 1,01,54,100 బీర్లు హైదరాబాద్ వాసులు లాగించేశారన్నమాట.

మందు వద్దు, బీర్లే ముద్దు..

సహజంగా మందు బాబులు తమకి ఇష్టమైన బ్రాండ్లు మాత్రమే తీసుకుంటారు. యువత బీర్లవైపు మొగ్గు చూపుతుంటే.. మందు అలవాటైన వాళ్లు మాత్రం బీర్లను చిన్నచూపు చూస్తారు. కానీ ఇప్పుడు పెద్ద, చిన్న తేడా లేకుండా అందరూ బీర్లు లాగించేస్తున్నారు. విస్కీ, బ్రాంది తదితర బ్రాండ్లు అలవాటున్న వ్యక్తులు సైతం ఎండల ధాటికి తాళలేక చల్లని బీరు కావాలని అడుగుతున్నారట. గ్రేటర్ పరిధిలో రోజుకి సగటున 6 లక్షల బీర్లు అమ్ముడవుతున్నాయి.

First Published:  19 April 2023 12:23 PM IST
Next Story