వచ్చేనెల నుంచి పెరగనున్న బీర్ల ధరలు!
చివరగా రెండేళ్ల కిందట 2022 మేలో 6శాతం చొప్పున రెండుసార్లు పెంచారు. బ్రూవరీల విజ్ఞప్తి మేరకు మరోసారి ధరలు పెరగబోతున్నాయి.
తెలంగాణలో బీర్ల ధరలు పెరగబోతున్నాయి. బ్రూవరీలకు ప్రస్తుతం చెల్లిస్తున్న ధరలను 10 నుంచి 12 శాతం మేర పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఈ భారం కస్టమర్లపైనే పడనుంది. రేట్లు పెరిగితే కస్టమర్‌కు ఒక్కో బీర్‌పై 15 నుంచి 20 రూపాయల భారం పడనుంది. పెరిగిన ధరలు వచ్చేనెల నుంచి అమల్లోకి వచ్చే అవకాశముంది.
బ్రూవరీలతో ప్రభుత్వం కుదుర్చుకునే ఒప్పందం రెండేళ్లపాటు అమల్లో ఉంటుంది. గడువు పూర్తయ్యాక ధరలను సవరించి మళ్లీ రెండేళ్ల ఒప్పందాన్ని కొనసాగిస్తారు. ప్రతి రెండేళ్లకూ బ్రూవరీలకు చెల్లించే ధరను దాదాపు 10శాతం మేర పెంచుతూ ఉంటుంది. చివరగా రెండేళ్ల కిందట 2022 మేలో 6శాతం చొప్పున రెండుసార్లు పెంచారు. బ్రూవరీల విజ్ఞప్తి మేరకు మరోసారి ధరలు పెరగబోతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 6 బ్రూవరీల్లో ఏటా 68 కోట్ల లీటర్ల బీరు తయారు అవుతోంది. ఆ బీరును తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కొని.. మద్యం షాపులకు సరఫరా చేస్తోంది. 12 బీర్ల కేసుకు గానూ బ్రూవరీలకు TSBCL రూ.289 చెల్లిస్తోంది. పన్నులన్నీ కలుపుకొని కేసుకు రూ.1400తో మద్యం దుకాణాలకు అమ్ముతోంది. ఇతర ఖర్చులన్నీ కలిపి మద్యం షాపుల వాళ్లు కేసు రూ.1800 చొప్పున అమ్ముతున్నారు. అంటే.. ఒక్కో బీరునూ ప్రభుత్వం బ్రూవరీల వద్ద రూ.24.08కి కొని రూ.116.66కి మద్యం దుకాణాలకు విక్రయిస్తుండగా.. కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి ఒక్కో బీరు రూ.150 అవుతోంది. రేట్లు పెరిగితే ఇది రూ. 165 దాటుతుంది.