Telugu Global
Telangana

సోషల్ మీడియాతో జర జాగ్రత్త.. నిఘా పెట్టిన ఈసీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది.

సోషల్ మీడియాతో జర జాగ్రత్త.. నిఘా పెట్టిన ఈసీ
X

సోషల్ మీడియా అంటేనే అపరిమితమైన వాక్ స్వాతంత్రం. సామాన్య పౌరుడు కూడా దేశ ప్రధానిని ప్రశ్నించగలిగే వేదిక. అదే సమయంలో ప్రభుత్వాలు తమ సేవలను ప్రజలకు చేరువ చేయవచ్చు. రాజకీయ పార్టీలు తమ వాగ్దానాలను ప్రజల వద్దకు తీసుకొని వెళ్లవచ్చు. సోషల్ మీడియా ఇప్పుడు ప్రధాన మీడియానే మించిపోయింది. ప్రజలను ప్రభావితం చేయగలిగే అతిపెద్ద ప్లాట్‌ఫామ్‌గా సోషల్ మీడియా ఎదిగింది. అందుకే ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా దీనిపై నిఘా పెట్టింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది. రాష్ట్రంలో మరో 49 రోజుల పాటు ఎన్నికలకు సమయం ఉన్నది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, మేనిఫెస్టో వంటి విషయాలపై దృష్టి పెట్టాయి. అదే సమయంలో ఆయా పార్టీలు చేసే ప్రచారంపై కూడా నిఘా పెట్టాయి. గతంలో పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే ప్రకటనపై గట్టి పర్యవేక్షణ ఉండేది. అయితే ఈ సారి సోషల్ మీడియాపై కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించింది.

ఎన్నికలకు సంబంధించి సాధారణ పౌరులు మాట్లాడుకునే విషయాలపై కాకుండా.. ఆయా పార్టీల అఫీషియల్ అకౌంట్లు, అభ్యర్థుల ఖాతాలపై నిఘా పెట్టాలని డిసైడ్ అయ్యింది. అభ్యర్థులు సోషల్ మీడియాలో ఎలాంటి ప్రచారం చేస్తున్నారు.. వారేమైనా తాయిలాలు ప్రకటిస్తున్నారా? ఇతరులపై దుష్ప్రచారం చేస్తున్నారా? వర్గాల మధ్య అల్లకల్లోలాలు సృష్టిస్తున్నారా? అనే విషయాలపై గట్టి నిఘా పెట్టింది. ఇందుకోసం 22 ఏజెన్సీతో ఎలక్షన్ కమిషన్ ఒప్పందం కుదుర్చుకున్నది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌తో పాటు.. ఆయా మాధ్యమాల ద్వారా ఒకరికి ఒకరు పంపుకునే వీడియో క్లిప్పులు, ప్రచార కార్యక్రమాల వివరాలపై కూడా కన్నేసింది. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో నిఘా ఇప్పటికే ప్రారంభం అయినట్లు ఈసీ వర్గాలు చెప్పాయి. ఎన్నికల సమయంలో అక్రమ మద్యం, డబ్బుల పంపిణీకి సంబంధించిన మెసేజెస్ కూడా ఈసీ స్కాన్ చేయనున్నట్లు తెలిసింది.

ఇప్పటికే అభ్యర్థులు, ఆశావహులు, అనుచరులు, అభిమానులు, సోషల్ మీడియా కార్యకర్తల అకౌంట్లను సేకరిచిన ఈసీ.. ఆయా ఖాతాలపై నిఘాను మొదలు పెట్టింది. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వారిపై ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కింద కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉన్నది. ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలతో పాటు బల్క్ మెసేజెస్ పంపే వారిపై ఈ నిఘా ఎన్నికలు ముగిసే వరకు కొనసాగనున్నది.

ఆయా మాధ్యమాల్లో రూమర్లు ప్రచారం చేసినా, ఎన్నికలకు సంబంధించిన అబద్దపు వార్తలను ఫార్వర్డ్ చేసినా కఠిన చర్యలు ఉంటాయని అధికారులు చెప్పారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ఎవరు వ్యవహరించినా ఆయా సెక్షన్ల కింద కేసులు బుక్ చేయనున్నారు. కాబట్టి సోషల్ మీడియాను ఉపయోగించే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని ఎన్నికల అధికారులు హెచ్చరిస్తున్నారు.

First Published:  11 Oct 2023 11:57 AM GMT
Next Story