Telugu Global
Telangana

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి.. కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు తీవ్రంగా ఉన్నందున సహాయక చర్యల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను సీఎం శాంతి కుమారి ఆదేశించారు.

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి.. కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు
X

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. తెలంగాణలోని పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉందని చెప్పింది. భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు తీవ్రంగా ఉన్నందున సహాయక చర్యల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను సీఎం శాంతి కుమారి ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి.. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని అన్నారు.

జిల్లా కలెక్టర్లు అందరూ భారీ వర్షాలు, వరదలతో జరిగే నష్టాన్ని నివారించేందుకు మండల స్థాయి రెవెన్యూ, పీఆర్ అధికారులతో సమీక్షలు నిర్వహించాలని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మ్యాన్ హోల్స్‌పై మూతలు తెరవకుండా నగరవాసులను చైతన్యం చేయాలని అధికారులకు సూచించారు.

అన్ని జిల్లాల్లో చెరువులు, కుంటలు నిండిపోయి ఉన్నాయి. ఆయా చెరువులకు గండ్లు పడకుండా, తెగిపోకుండా ఉండేందుకు తగిన రక్షణ చర్యలు ముందస్తుగా చేపట్టాలని అధికారులు ఆదేశించారు. వరద భారీ ఎత్తున ప్రవహించే కాజ్ వేలు, కల్వర్టులు, బ్రిడ్జీల వద్ద ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, భద్రత చర్యలు చేపట్టాలని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అగ్నిమాపక, పోలీసు బృందాలను మోహరించాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ముంపు బాధిత కుటుంబాలను త్వరితగతిన సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు.


First Published:  6 Sept 2023 1:58 AM GMT
Next Story