తెలంగాణలో నేడు బీసీ సంబరం
రాష్ట్రవ్యాప్తంగా బీసీ చేయూత కోసం మొత్తం 5,28,862 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల నుంచి తొలి విడతలో 35,700మందిని ఎంపిక చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా బీసీలకు నేడు పండగ రోజు. వెనుకబడిన వర్గాల చేతివృత్తిదారులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న లక్ష రూపాయల ఆర్థిక సాయం నేటినుంచి పంపిణీ చేస్తారు. ప్రతి నియోజకవర్గానికి 300 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరందరికీ ఈ రోజు ఆర్థిక సాయాన్ని అందజేస్తారు. మొత్తం 35,700 మందికి తొలి విడతలో ఆర్థిక సాయం అందిస్తారు.
దశాబ్ది ఉత్సవాల్లో బీజం..
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంచిర్యాల వేదికగా ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రకటించారు. ఆర్థిక సాయం అందజేత నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలోని బీసీ కులవృత్తిదారులు, చేతివృత్తుల బలోపేతానికి ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సాయం పథకాన్ని రూపొందించింది. ఈ ఆర్థిక సాయం ద్వారా చేతివృత్తిదారులు తమకు అవసరమైన పనిముట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ముడిసరుకు కొనుగోలుకి, ఇతరత్రా అవసరాలకు ఈ సాయాన్ని వాడుకోవాలి.
దరఖాస్తుల వెల్లువ..
రాష్ట్రవ్యాప్తంగా బీసీ చేయూత కోసం మొత్తం 5,28,862 దరఖాస్తులు వచ్చాయి. ఇది నిరంతర ప్రక్రియ. ఈ దరఖాస్తుల నుంచి తొలి విడతలో 35,700మందిని ఎంపిక చేశారు. ప్రతి నెల 5లోగా వెరిఫికేషన్ పూర్తయినవారికి అదే నెల 15న ఎమ్మెల్యే చేతుల మీదుగా సాయం అందజేయాలని నిర్ణయించారు. ప్రతి నెలా నియోజకవర్గంలో 300మందికి లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక సాయం పక్కదారి పట్టకుండా ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో ఆ యూనిట్ల గ్రౌండింగ్ ను పర్యవేక్షిస్తారు. లబ్ధిదారులు కొనుగోలు చేసిన పనిముట్లను ఫొటోలు తీసి అప్ లోడ్ చేస్తారు.