Telugu Global
Telangana

బీసీలంతా టీఆర్ఎస్ వైపే.. మునుగోడులో చేరికల హడావిడి

బూర వెళ్లిపోయినా, ఆ వర్గానికి చెందిన నేతలెవరూ టీఆర్ఎస్ ని వీడేందుకు సిద్ధంగా లేరు. బీజేపీ, కాంగ్రెస్ నుంచి బీసీ వర్గానికి చెందిన నేతలు ఇప్పుడు టీఆర్ఎస్ వైపు చూడటం విశేషం.

బీసీలంతా టీఆర్ఎస్ వైపే.. మునుగోడులో చేరికల హడావిడి
X

బూర నర్సయ్య గౌడ్ ని టీఆర్ఎస్ కి దూరం చేసి, బీసీల ఓట్లను ఆకర్షించేందుకు బీజేపీ పెద్ద ఎత్తుగడ వేసింది. దాన్ని తమదైన శైలిలో చిత్తు చేశారు టీఆర్ఎస్ నేతలు. బూర బీజేపీకి దగ్గరైనా బీసీలంతా టీఆర్ఎస్ తోనే ఉన్నారని తెలుస్తోంది. బూర వెళ్లిపోయినా, ఆ వర్గానికి చెందిన నేతలెవరూ పార్టీని వీడేందుకు సిద్ధంగా లేరు. బీజేపీ, కాంగ్రెస్ నుంచి బీసీ వర్గానికి చెందిన నేతలు ఇప్పుడు టీఆర్ఎస్ వైపు చూడటం విశేషం.

మునుగోడు మండలం కోతులారం సర్పంచ్ , మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షురాలు జాజుల పారిజాత , సత్యనారాయణ గౌడ్ దంపతులు మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌ లో చేరారు. మునుగోడు మండలం కిష్టాపురానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు మానుకుంట్ల కుమార స్వామి గౌడ్, పంతగి లింగస్వామి గౌడ్ , సురుగి లింగ స్వామి గౌడ్, జాజుల శ్రీశైలం తదితరులు కూడా టీఆర్ఎస్ లో చేరారు. గౌడ వర్గానికి చెందిన నాయకుల సమక్షంలో వీరంతా కాంగ్రెస్ ని వీడి టీఆర్ఎస్ లో చేరడం విశేషం. గౌడ 'జన బంధువు' సీఎం కేసీఆర్‌ వెంటే తాము ఉంటామని టీఆర్ఎస్ లో చేరిన నాయకులు పేర్కొన్నారు.

ఆరుగురు సర్పంచ్ లు చేరిక..

మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, మునుగోడు మండలాలకు చెందిన ఆరుగురు సర్పంచ్ లు ఒకేసారి మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌ లో చేరారు. కస్తాల, నెర్మట, గుండ్ర పల్లి, దోనిపాముల, తుమ్మలపల్లి గ్రామాల సర్పంచ్ లు చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఎన్నికలు దగ్గరపడే సమయానికి మరిన్ని చేరికలు ఉంటాయని చెబుతున్నారు టీఆర్ఎస్ నేతలు. బీసీలంతా టీఆర్ఎస్ వెంటే ఉన్నారని, బీజేపీ వ్యూహాలు ఇక్కడ పనిచేయవని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

First Published:  16 Oct 2022 12:32 PM GMT
Next Story